250వ టెస్ట్: ఈడెన్‌ది పెద్ద చరిత్రే, NO.1పై కన్నేసిన కోహ్లీ సేన
కోల్‌కత్తా: విరాట్ కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా జట్టు కోల్‌కత్తాకు చేరుకుంది. మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ సెప్టెంబర్ 30 (శుక్రవారం) నుంచి ప్రారంభం కానుంది. జట్టు వెంట కోచ్ కుంబ్లే కూడా ఉన్నారు.
న్యూజిలాండ్ తొలి టెస్టులో ఆడిన ఓపెనర్ కేఎల్ రాహుల్, తొడ కండరాల గాయంతో బాధపడుతుండటంతో అతడి స్థానంలో గౌతమ్ గంభీర్‌కు జట్టులో చోటు కల్పించారు. గంభీర్‌ను ఎంపిక చేసేముందు బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో అతడికి ఫిట్‌నెస్ పరీక్ష నిర్వహించారు.
కాగా, రాహుల్ ఈ సిరిస్‌లోని మిగతా రెండు టెస్టులకు అందుబాటులో ఉండడని బీసీసీఐ కార్యదర్శి అజయ్ షిర్కే తెలిపాడు. డెంగీ జ్వరంతో తొలి టెస్టు దూరమైన ఫాస్ట్‌బౌలర్ ఇషాంత్ శర్మ ఇంకా కోలుకోకపోవడంతో అతడి స్థానంలోకి ఆఫ్ స్పిన్నర్ అయిన జయంత్ యాదవ్‌ను ఎంపిక చేశారు.
బుధవారం టీమిండియా ఈడెన్ గార్డెన్స్‌లో ప్రాక్టీసు సెషన్స్ పాల్గొంటుంది. తొలి టెస్టులో ఓటమి పాలైన న్యూజిలాండ్ రెండో టెస్టులో గెలవాలనే కృత నిశ్చయంతో ఉంది. మరోవైపు మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భారత్ 1-0 తేడాతో ముందంజలో ఉంది.

స్వదేశంలో 250వ టెస్టు
ఈడెన్ గార్డెన్స్‌లో జరిగే మ్యాచ్ టీమిండియాకు స్వదేశంలో 250వ టెస్టు మ్యాచ్ కావడం విశేషం. ప్రతిష్టాత్మక మ్యాచ్‌కు ఇదే అత్యుత్తమ వేదిక అని చాటి చెప్పేలా ఈడెన్‌ను క్యాబ్ ముస్తాబు చేస్తోంది. భారత్‌లోని అత్యుత్తమ స్టేడియాల్లో ఈడెన్ గార్డెన్స్ ఒకటి. ఈ ప్రతిష్టాత్మక స్టేడియంలో టీమిండియా ఎన్నో అద్భుతమైన విజయాలను సొంతం చేసుకుంది. ఈడెన్ ఇప్పుడు స్వదేశంలో భారత ఆడబోయే 250 టెస్టుకు ఆతిథ్యం ఇవ్వబోతోంది.

టెస్టుల్లో నెంబర్ వన్ స్థానానికి
ఈడెన్‌లో జరగనున్న ఈ 250వ టెస్టు మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధిస్తే టెస్టుల్లో నెంబర్ వన్ స్థానానికి చేరుకుంటుంది. కాన్పూర్‌లో జరిగిన టెస్టు మ్యాచ్‌లో కివీస్ పరాజయం పాలైనప్పటికీ, న్యూజిలాండ్ రెండో టెస్టులో నెగ్గి భారతకు షాకిస్తుందా? అనేది ఆసక్తికరంగా మారింది. పాక్ టెస్టు హోదాను లాగేసుకోవడానికి టీమిండియాకు ఒక్క విజయం సాధిస్తే చాలు.

111 పాయింట్లతో పాకిస్థాన్ నెంబర్ వన్
ఈడెన్ గార్డెన్స్ టెస్టులో గెలిస్తే ర్యాంకింగ్స్‌లో భారత్ తిరిగి అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంటుంది. నెంబర్‌వన్ జట్టుగా ఉన్న పాకిస్థాన్ (111), భారత్ జట్ల మధ్య ఒక్క పాయింట్ తేడా ఉంది. న్యూజిలాండ్‌తో సిరీస్ సొంతం చేసుకుంటే రెండో స్థానంలోని భారత్.. పాకిస్థాన్‌ను వెనక్కినెట్టి నెంబర్‌వన్ ర్యాంక్ దక్కించుకుంటుంది.

వరుణుడు అడ్డంకిగా మారే అవకాశాలు
మరోవైపు ఈ మ్యాచ్‌కు వరుణుడు అడ్డొచ్చే అవకాశాలూ లేకపోలేదు. కోల్‌కతాలో వర్షాలు పడుతున్న నేపథ్యంలో మొత్తం 15 సెషన్ల ఆట కచ్చితంగా సాధ్యపడుతుందని చెప్పలేమంటున్నారు క్రీడా నిపుణులు. ఒకవేళ ఈ మ్యాచ్‌లో డ్రా ఎదురైనా, టీమిండియాపై పెద్దగా ప్రభావం చూపకపోవచ్చు. ఈడెన్‌లో జరిగే టెస్టు మ్యాచ్‌లో ఫలితం తేలకపోతే వరుసగా 13 టెస్టుల్లో ఓటమి ఎరుగని జట్టుగా భారత నిలుస్తుంది.

12 మ్యాచ్‌ల్లో టీమిండియా పరాజయం పాలు కాలేదు
1980 ఫిబ్రవరి 15 తర్వాత ఇన్ని ఎక్కువ మ్యాచ్‌ల్లో ఓటమి లేకుండా సాగిపోవడం ఇదే తొలిసారి. అయితే నెంబర్ వన్ ర్యాంక్ కోసం ఇండోర్ టెస్ట్ వరకూ వేచి ఉండాల్సి ఉంటుంది. గతంలో రెండు సార్లు స్వదేశంలో వరుసగా 12 మ్యాచ్‌ల్లో టీమిండియా పరాజయం పాలుకాలేదు. కానీ, 13వ మ్యాచ్ ఎప్పుడూ భారతకూ కలిసి రాలేదు. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో ఆ రికార్డును చేరుకునేందుకు ఈడెన్ కన్నా మించిన చాన్స్ భారతకు మరోకటి లేదని క్రీడా పండితులు విశ్లేషిస్తున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications