IPL 2025 Sai Sudharsan: ఐపీఎల్ 2025 రసవత్తరంగా సాగుతోంది. అయితే ఈ సీజన్ లో అంచనాలకు మించి రాణిస్తోన్న ఆటగాడు ఎవరంటే సాయి సుదర్శన్. అందుకే ప్రస్తుతం అంతా గుజరాత్ టైటాన్స్ సాయి సుదర్శన్ పేరే ఎక్కువగా వినిపిస్తోంది. ఇప్పటికే అతడు 504 పరుగులతో ఆరెంజ్ క్యాప్ రేసులో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. దీంతో ఐపీఎల్ 2025 తర్వాత భారత్ జట్టు వెళ్లనున్న ఇంగ్లాండ్ టెస్ట్ టూర్ కు కూడా అతడిని ఎంపిక చేయాలన్న డిమాండ్ ఎక్కువగా వినిపిస్తోంది. అయితే ఇతడు తాజాగా జరిగిన మ్యాచులో సన్ రైజర్స్ హైదరాబాద్ సీనియర్ పేసర్ మహ్మద్ షమీని ఊచకోత కోశాడు. అతడి బౌలింగ్ లో ఏకధాటిగా ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో ఇప్పుడంతా వీరిద్దరి గురించే అంతా మాట్లాడుకుంటున్నారు.
ఈ మ్యాచులో మొదట టాస్ ఓడి బ్యాటింగ్ చేసింది గుజరాత్ టైటాన్స్. అయితే ఈ పోరులోనూ ఎప్పటిలాగానే టాప్-3 బ్యాటర్లు తమ మెరుపులతో అదరగొట్టేశారు. భీకర ఫామ్‌ను కొనసాగిస్తూ భారీ షాట్లు ఆడేశారు. మొదట గిల్, సుదర్శన్ జట్టుకు అదిరే ఆరంభానివ్వగా... తర్వాత బట్లర్ జట్టుకు మంచి స్కోరు అందించాడు.

ముందుగా ఓపెనర్లు ఇద్దరూ కొత్త బంతి బౌలర్ మహ్మద్ షమిని లక్ష్యంగా చేసుకుని బాదేశారు. షమి వేసిన తొలి ఓవర్లోనే గిల్ సిక్స బాదితే.. మూడో ఓవర్ లో సాయి సుదర్శన్ ఏకంగా ఐదు ఫోర్లు కొట్టేశాడు. ఇద్దరూ పోటీపడి మరీ షాట్లు ఆడారు. దీంతో గుజరాత్ పవర్‌ప్లేలోనే వికెట్ నష్టపోకుండా 82 పరుగులు నమోదు చేసింది.
అయితే ఇక్కడ సుధర్శన్ ఆడిన ఆగ్రసివ్ ఆటతీరు, బ్యాటింగ్ టెక్నిక్ అద్భుతంగా ఉందని క్రికెట్ అభిమానులు, పండితులు కొనియాడుతున్నారు. షమీ సంధించిన బంతులను మైదానంలోని నలువైపులా బాదుతూ, పరుగులు సాధించడం అదిరిందని అంటున్నారు. షమీ వంటి అనుభవజ్ఞులైన బౌలర్లను ధైర్యంగా ఎదుర్కోవడంలో అతడి సామర్థ్యం కనిపిస్తుందని చెబుతున్నారు. ఈ అద్భుత ప్రదర్శన టైటాన్స్ ఇన్నింగ్స్‌కు మంచి ఊపు తీసుకొచ్చిందని, అలానే జట్టులో కీలక ఆటగాడిగా సుధర్శన్ ఎదుగుతున్న విధానాన్ని స్పష్టంగా చూపించిందని ఫ్యాన్స్ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
తుస్సుమనిపించిన షమీ..
ఇదే సమయంలో షమీ పేలవ ప్రదర్శనపై దారుణంగా విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ సీజన్ లో అతడు 9 ఇన్నింగ్స్ లో కేవలం 6 వికెట్లు మాత్రమే తీశాడు. ఆరు మ్యాచుల్లో అయితే అతడు తన నాలుగు ఓవర్ల కోటాను కూడా పూర్తి చేయలేదు. గాయం నుంచి కోలుకుని తిరిగి వచ్చాక ఆశించిన స్థాయిలో ప్రదర్శన చేయలేకపోతున్నాడు. తన రిథమ్ ను కొనసాగించలేకపోతున్నాడు. రీసెంట్ గా ఛాంపియన్స్ ట్రోఫీలోనూ నిలకడ ప్రదర్శన చేయలేకపోయాడు. దీంతో త్వరలోనే వెళ్లబోయే ఇంగ్లాండ్ టూర్ లో అతడి స్థానంపై సందిగ్ధత ఏర్పడింది. అయినప్పటికీ షమీకి చోటు దక్కుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే అతడికి ఇంగ్లాండ్ పిచ్ లపై మంచి అనుభవం ఉంది. అక్కడ అతడు 14 టెస్టులు ఆడాడు. 40.50 సగటుతో 42 వికెట్లు తీశాడు. చూడాలి మరి ఏం జరుగుతుందో..