రాస్ టేలర్ ఆత్మకథలో సంచలన విషయాలు.. డ్రెస్సింగ్ రూంలోని చీకటి కోణాలను బయటపెట్టిన రాస్సీ

న్యూజిలాండ్ క్రికెట్ టీం అంటే క్రీడాస్ఫూర్తిని చాటుకునే మంచి జట్టు అని ఓ అభిప్రాయం ఉంది. ఆ జట్టులోని ప్లేయర్లు స్లెడ్జింగ్, తదితర వివాదాల జోలికి వెళ్లరనే సంగతి తెలిసిందే. ఫెయిర్ ప్లేలో న్యూజిలాండ్ టీంకు ఓ ఇమేజ్ ఉంది. ఆ జట్టు పట్ల ప్రపంచ క్రికెట్లో ఓ నిశ్చితాభిప్రాయమే ఉంది. కానీ న్యూజిలాండ్ క్రికెట్లోని చీకటి కోణాలను ఆ జట్టు మాజీ స్టార్ ప్లేయర్ రాస్ టేలర్ బయటపెట్టాడు. జట్టులో జరిగే జాత్యాహంకార ధోరణిని బట్టబయలు చేశాడు. న్యూజిలాండ్ క్రికెట్లో పాతుకుపోయిన రేసిజం నిజాన్ని నిగ్గు తేల్చాడు. పైన పటారం లోన లొటారం అన్న చందాన ఆ దేశ జట్టులోని కొందరు వ్యవహరించే కపట బుద్ధిని కడిగిపారేశాడు. అన్ని అవమానాలను స్పోర్టివ్ నెస్ అనే మాట కింద అనుభవించాల్సొచ్చిందని తేల్చిచెప్పాడు. అతను తన ఆత్మకథ రాస్ టేలర్ 'బ్లాక్ అండ్ వైట్'లో న్యూజిలాండ్ టీంలో పాతుకుపోయిన రేసిజం గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు.

ఏదో సరదా కోసమంటూనే.. అనరాని మాటలు అనేవారు
న్యూజిలాండ్ క్రికెట్‌లో వివక్ష చాలా సర్వ సాధారణమని అందుకు తానే బాధితుడినని రాస్ టేలర్ తన ఆటోబయోగ్రాఫీలో పేర్కొన్నాడు. 'టీంలో 16 ఏళ్లుగా నా ప్రస్థానం పైకి కన్పించినంత సజావుగా ఏం సాగలేదు. బయట ప్రపంచానికి తెలిసింది ఒకే కోణం. కానీ రెండో వైపు మరో కోణం ఉంది. డ్రెస్సింగ్ రూమ్‌లో ఎంతటి వివక్ష చూపుతారో బయట ప్రపంచానికి తెలియదు. ఏదో జస్ట్ ఆటపట్టిస్తున్నట్లు కామెంట్లు చేస్తూనే అనరాని మాటలు అనేవారు. ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నా. ఎన్నో సార్లు వాళ్లపై అరవాలనుకున్నా.. కానీ ఏదో జోక్ కోసం ఓ మాటంటే రేసిజం అంటూ టేలర్ ఇంత పని చేస్తున్నాడేంటీ అంటూ నన్నే నిందించేవారేమోనని ఇన్నేళ్లుగా మౌనంగానే ఉన్నా' అన్నాడు.

రాస్ నువ్వు సగం మావోడివి.. సగం?
'డ్రెస్సింగ్ రూంలో నా సహచర క్రికెటర్లు కొందరు తరచు నా మొహం గురించి కామెంట్స్ చేసేవాళ్లు. నీ మొహం చూసుకున్నావా టేలర్.. నీ మొహం నువ్వు న్యూజిలాండ్ మనిషివే కావన్నట్లు ఉంటుంది. రాస్ నువ్వు సగం మాత్రమే మావోడివి.. మిగతా సగం ఏంటనేది నువ్వే తేల్చుకో అనేవాళ్లు. నాకు మండిపోయేది కానీ నా మట్టుకు నేను క్రికెట్ మాత్రమే నా జీవితమని, ఇలాంటివి నేను పట్టించుకోనని ఊర్కునేవాణ్ని.. హాస్యం శ్రుతిమించుతున్నా నాలోనే బాధను దిగమింగుకునేవాడిని.. నా ప్రకారం డ్రెస్సింగ్ రూమ్ నాకో బారో మీటర్ అనిపించేది' అంటూ టేలర్ వాపోయాడు.

కించపరచడమే వాళ్లకు తెలుసు
ఇక టేలర్ తనపై జాత్యాహంకారపూరిత ప్రవర్తన బట్టి న్యూజిలాండ్లో క్రికెట్ అనేది తెల్లవాళ్ల ఆట.. నా లాంటి వాళ్లను మాటల్తో కించపరచడమే కొందరికి తెలుసు. నేను మా అమ్మ తరఫున మరో దేశ మూలాలు కలిగి ఉన్నాను.. అందువల్లే నేను గోధుమ రంగులో ఉన్నాను. వాళ్లందరిలో నేనే డిఫెరెంట్‌గా ఉండేవాడిని. దాన్ని సాకుగా చేసుకుని వల్గర్ మాటలతో జోక్ చేస్తున్నట్లే కవ్వించేవారు. ఇకపోతే డ్రెస్సింగ్ రూం బయట మాత్రం అందరం ఆట మీదే దృష్టి పెట్టేవాళ్లం.' అని పేర్కొన్నాడు. ఇకపోతే రాస్ టేలర్ తన ఆత్మకథలో పేర్కొన్న ఈ విషయాలు పెను ప్రకంపనలు రేపుతున్నాయి. న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ఈ విషయమై చర్యలు చేపడతామని పేర్కొంది. జట్టులో వివక్షకు ఎప్పుడూ తావు ఇవ్వబోమని ఆ దేశ బోర్డు పేర్కొంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications