ఇస్లామాబాద్: పాకిస్థానీ మాజీ క్రికెటర్, తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ ఛైర్మన్ ఇమ్రాన్ ఖాన్ మూడో పెళ్లి గురించి మీడియాలో వస్తున్న వార్తలపై ఆయన స్పందించారు. తాను మూడో పెళ్లి చేసుకోవడంలేదని, ఒక వేళ చేసుకోవాలనిపిస్తే తానే స్వయంగా ప్రకటిస్తానని ఆయన తన ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు.
తన వివాహ వేడుకను బహిరంగంగానే జరుపుకుంటానని ఆయన తెలిపారు. కాగా, ఇమ్రాన్‌ఖాన్ త్వరలో మూడో పెళ్లి చేసుకుంటున్నాడని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఆధ్యాత్మిక గురువు బుష్రా సోదరి మరియంను ఖాన్ వివాహమాడనున్నట్లు మీడియా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

లండన్‌లో తన ఇద్దరు కుమారులతోపాటు ఓ మహిళతో ఇమ్రాన్ కనిపించాడని.. ఆమే మూడో భార్య అయి ఉండొచ్చని పేర్కొంది. ఆమె పేరు 'మరియం' అని ఓ చానెల్ తెలిపింది. అయితే ఈ వార్తలను ఆయన ఖండించారు. ఇమ్రాన్‌ఖాన్ మొదట పాకిస్థానీ-బ్రిటిష్ జర్నలిస్టు జెమీమా గోల్డ్‌స్మిత్‌ను పెళ్లి చేసుకున్నారు.
ఈ జంటకు ఇద్దరు కుమారులు. ఆ తర్వాత జెమీమా నుంచి విడిపోయి 2015 జనవరిలో రెహమ్‌ఖాన్ అనే టీవీ వ్యాఖ్యాతను వివాహమాడారు. కొన్ని కారణాల వల్ల పెళ్లి చేసుకున్న తొమ్మిది నెలలకే రెహమ్, ఇమ్రాన్ ఖాన్ విడాకులు తీసుకున్నారు.