
హైదరాబాద్: ప్రస్తుత భారత జట్టులోని క్రీడాకారులలో చాలా మందికి దక్షిణాఫ్రికా టూర్‌లో ఆడిన అనుభవం ఉందని అది ఈ సారి ఆడడానికి కూడా బాగా ఉపయోగపడుతుందని పూజారా అభిప్రాయపడ్డాడు. జనవరి 5 ఆతిథ్య దక్షిణాఫ్రికాతో మొదటి టెస్ట్‌లో భాగంగా భారత్ జట్టు ప్రాక్టీసును ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలో భారత ప్రధాన బ్యాట్స్‌మన్ చటేశ్వర్ పుజారా ఇలా వ్యాఖ్యానించాడు.
'దక్షిణాఫ్రికా పిచ్‌లంటేనే బౌన్స్ ఉంటుంది. అది ఎప్పటికీ సవాలే. కానీ ఈసారి మేం మంచి సన్నద్ధతతో ఉన్నాం. నెల, నెలన్నరగా ఏం చేశామో దానినే కొనసాగించాలనుకుంటున్నాం'అని అన్నాడు. ప్రస్తుత జట్టులోని చాలామందికి దక్షిణాఫ్రికా మైదానాల్లో ఆడిన అనుభవం ఉండటం బాగా ఉపయోగపడుతుందని మంగళవారం ప్రాక్టీస్ అనంతరం అతను పేర్కొన్నాడు.
బంతులను ఎలా ఆడాలి? ఏ బంతులను అటెంప్ట్ చేయకుండా ఉండటం మంచిది? అనేది విదేశీ పర్యటనల్లో చాలా కీలకం. ఉపఖండం బయట బౌన్స్ ఎక్కువగా ఉండే పిచ్‌లే ఎదురవుతాయి. ఇలాంటి సమయంలో మంచి బంతులను వదిలేయడం అలవర్చుకోవాలి' అని విశ్లేషించాడు.
ఇప్పటికే రెండుసార్లు దక్షిణాఫ్రికా పర్యటించిన పూజారా
రెండుసార్లు ఇక్కడ పర్యటించిన అనుభవమున్న పుజారా పరిస్థితులను అంచనా వేసుకుంటూ తగిన విధంగా ఆటను మలుచుకోవాలని సూచించాడు. 'శ్రీలంకతో స్వదేశంలో ఆడుతున్నప్పుడే దక్షిణాఫ్రికా సిరీస్ గురించి ఆలోచనలు చేశాం. కొన్ని అంశాలపై సన్నద్ధమయ్యాం. మేమేం ఇబ్బందిగా భావించడం లేదు. సన్నాహాలకు చాలా సమయం కూడా దొరికింది' అని పేర్కొన్నాడు.
'ఇలాంటి చోట పరుగులు చేయడంలో అనుభవానికి మించి ఏదీ సాటిరాదు. పిచ్, ప్రత్యర్థితో పాటు, ఆటగాడిగా, జట్టుగా ఏం చేయాలో తెలుసుకోవాలి' అని విశ్లేషించాడు. తొలి టెస్టుకు సన్నాహాలు బాగా సాగుతున్నాయని పేర్కొన్న పుజారా... విజయావకాశాలపై ఆశాభావం వ్యక్తం చేశాడు. 'పచ్చిక ఉన్నా, ఫ్లాట్ వికెట్ అయినా కేప్‌టౌన్‌లో పిచ్ గురించి ఆందోళన చెందడం లేదు. మాకో వ్యూహం ఉంది' అని స్పష్టం చేశాడు.
ప్రత్యర్థి బలాబలాలపై మాట్లాడేందుకు నిరాకరించిన ఈ వన్‌డౌన్ బ్యాట్స్‌మన్... తమ పేస్ బలగం సామర్థ్యంపై గట్టి నమ్మకముంచాడు. ప్రస్తుత పర్యటనతో పాటు వచ్చే 18 నెలల్లో ఇంగ్లండ్, ఆస్ట్రేలియాల్లోనూ విజయాలు సాధిస్తే 'ఆల్‌టైం గ్రేట్ భారత జట్టు'గా నిలుస్తామనే అభిప్రాయం వ్యక్తం చేశాడు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.