IPL 2025 Sunrisers Hyderabad: ఐపీఎల్ 2025లో భాగంగా తాజాగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 8 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది. 246 పరుగుల భారీ లక్ష్యాన్ని రెండే వికెట్లు కోల్పోయి 18.3 ఓవర్లలోనే ఛేదించింది. దీంతో నాలుగు వరుస ఓటముల తర్వాత ఎట్టకేలకు హైదరాబాద్ జట్టు సక్సెస్ రుచి చూసింది. పాయింట్ల పట్టికలోనూ 8వ స్థానానికి వచ్చింది.
అస్సలు ఊహించలే..
అయితే వాస్తవానికి గత 4 మ్యాచుల ప్రదర్శన చూస్తే.. ఈ సారి 246 పరుగుల లక్ష్య ఛేదన సన్‌రైజర్స్‌కు పెద్ద కష్టమే అని క్రికెట్ అభిమానులంతా అనుకున్నారు! కానీ ఈ సారి హైదారాబాద్ పట్టుదలను వదలలేదు. తమ మార్క్ విధ్వంసంతో అదరగొట్టింది. సన్‌రైజర్స్ ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ చెలరేగి విధ్వంసం సృష్టించారు. వీరిద్దరిలో ఎవరికి స్ట్రైక్ వచ్చినా బంతి మాత్రం బౌండరీకి లేదంటే స్టాండ్స్‌లోకి వెళ్లడమే పనిగా పెట్టుకున్నారు.

జూలు విదిల్చారు..
అలా అభిషేక్ శర్మ (55 బంతుల్లో 141; 14 ఫోర్లు, 10 సిక్స్‌లు) పంజాబ్ బౌలర్లపై జూలు విదిల్చి ఆడాడు. ట్రావిస్ హెడ్ (66; 37 బంతుల్లో 9×4, 3×6) దండయాత్ర చేశాడు. ఈ దెబ్బకు మైదానంలో సన్‌రైజర్స్ అభిమానుల కేరింతలు మిన్నంటాయి. అభిమానులు జెండాలు ఊపుతూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఆటగాళ్లలో మరింత ఉత్సాహం నింపారు.
నేను అతడి బ్యాటింగ్‌కు అభిమానిని..
ఈ క్రమంలోనే పంజాబ్ కింగ్స్‌పై SRH ఘన విజయం సాధించిన తర్వాత కెప్టెన్ పాట్ కమిన్స్ ఆనందం వ్యక్తం చేశాడు. తమ జట్టు బ్యాటింగ్, పిచ్ స్వభావం, అభిషేక్ శర్మ బ్యాటింగ్, అభిమానుల స్పందన సహా పలు అంశాలపై తన అభిప్రాయాలు తెలిపాడు. ప్యాట్ కమిన్స్ మాట్లాడుతూ.. "అద్భుతంగా ఉంది. ఇది మా ఆట శైలికి సరిగ్గా సరిపోతుంది. మేం అద్భుతం చేస్తామని ముందే తెలుసు. ఇది మంచి వికెట్. ఇక్కడ బంతి బాగా బౌన్స్ అవుతుంది. ప్రతి ఓవర్ లో 10 పరుగులకు తక్కువగా ఇవ్వడం, ఓ బౌలర్‌గా పెద్ద విజయం లాంటిది. అసలు ఇంత భారీ లక్ష్యాన్ని చేధించగలమనే నమ్మకం ఉండటం కూడా క్రేజీగా అనిపిస్తుంది. నేను అభిషేక్ బ్యాటింగ్‌కు పెద్ద ఫ్యాన్. మేము మా ఆటతీరును మార్చాలనే ఆలోచన లేదు. మా బ్యాటింగ్ విభాగం గతేడాది కూడా బాగా ఆడింది. వారి ప్రతిభపై మాకు నమ్మకముంది. అభిమానులు అద్భుతంగా స్పందిస్తున్నారు. ఎప్పుడూ జెండాలు ఊపుతూ, స్టేడియంలో గొప్ప వాతావరణాన్ని సృష్టిస్తున్నారు," అని కమిన్స్ హర్షం వ్యక్తం చేశాడు. ఇకపోతే ఈ మ్యాచులో 4 ఓవర్లు వేసిన ప్యాట్ కమిన్స్.. వికెట్ తీయకుండా 40 పరుగులు సమర్పించుకున్నాడు.