
హైదరాబాద్: భారత మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ మనోజ్ తివారీ జాతీయ జట్టు సెలక్టర్లపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాడు. దులీప్ ట్రోఫీలో భాగంగా జరిగిన ఎంపికల్లో భారత్ ఏ జట్టుకు ప్రతిభ ఆధారంగా ఎంపిక జరగలేదంటూ విమర్శలు గుప్పించాడు. నాలుగు రోజుల పాటు జరగనున్న ఈ మ్యాచ్‌లకు దక్షిణాఫ్రికా ఏ జట్టుతో తలపడేందుకు సెలక్టర్లు ఆరు జట్లు తయారు చేశాడు. ఇదే ట్రోఫీలో ఆస్ట్రేలియా ఏ, దక్షిణాప్రికా ఏ కూడా తలపడనున్నందున ఆ జట్లపై పోటీ పడేందుకు భారత్ ఏ జట్టు కూడా సంసిద్ధం కావాల్సి ఉంది.
ఈ విషయంపై మనోజ్ తివారీ మాట్లాడుతూ.. 'నన్ను కూడా భారత్ ఏ జట్టులోకి తీసుకుంటారని భావించాను. ఎవరైనా తన అత్యుత్తమ ప్రదర్శన చేసినప్పుడు కచ్చితంగా దానికి తగ్గ ప్రతిఫలాన్ని కోరుకుంటారు. ఆఖరి సీజన్‌లో 50ఓవర్ల ఫార్మాట్‌లో అత్యుత్తమ ప్రదర్శన చేశాను. భారత క్రికెట్ చరిత్రలోనే లేనంతగా వ్యక్తిగత స్కోరు నమోదు చేశాను'.
'ఇంతకంటే ఇంకా ఎక్కువ మరేం చేయాలో నాకైతే అర్థం కావట్లేదు. అదే విషయాన్ని వాళ్ల దగ్గర్నుంచి తెలుసుకోవాలని ఉంది. ఒకవేళ వాళ్లకేం కావాలో తెలిస్తే దానికనుగుణంగా నా ఆటతీరు మార్చుకునేందుకు సిద్ధంగానే ఉన్నాను. ఎందుకంటే నాకు భారత జట్టు తరపున ఆడాలని ఉంది'
'భారత జాతీయ జట్టులో ఆడాలని ఉండి.. ఒక్కో అడుగుముందుకు వేసుకుంటూ వెళ్తున్నాను. భారత్ ఏ జట్టులో రాహుల్ ద్రవిడ్ కోచింగ్‌లో ఆడాలని ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్నా. ఇప్పటికిప్పుడు సీనియర్ జట్టులో స్థానం దొరకడం కష్టమే కావచ్చు. కానీ, నిజాయతీగా కోరుకునేదేమంటే ప్రదర్శనకు తగ్గట్లు ఆదరించమని. భారత్ ఏ జట్టులో ఆటగాళ్లను ఎంచుకునేటప్పుడు నా రికార్డులు, ఆటతీరు గమనించాల్సింది' అని పేర్కొన్నాడు.