ఇంగ్లండ్ టెస్టు సిరీస్‌లో భారత్‌కు ఎన్నో ప్రతికూలాంశాలు లభించాయి. స్టార్ క్రికెటర్లు లేకపోయినా యువ క్రికెటర్లు జట్టు భారాన్ని గొప్పగా మోశారు. వచ్చిన అవకాశలను సద్వినియోగం చేసుకుని భవిష్యత్ తారలుగా భరోసా ఇచ్చారు. రజత్ పటిదార్, సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్, ఆకాశ్ దీప్, దేవదత్ పడిక్కల్ ఇంగ్లండ్ సిరీస్‌లో అరంగేట్రం చేసి సత్తాచాటారు.
అయితే ఈ యువ ప్లేయర్ల రాకతో విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ స్థానాలను భర్తీ చేసే ఆటగాళ్లు దొరికారని చర్చలు మొదలయ్యాయి. దీనిపై టీమిండియా మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ తన అభిప్రాయాన్ని తెలిపాడు. బౌలింగ్ విభాగంలో టీమిండియా పటిష్టంగా ఉందని, కానీ రోహిత్, కోహ్లి స్థానాన్ని భర్తీ చేసే ఆటగాళ్ల కోసం విదేశీ పర్యటనల ప్రదర్శన ఆధారంగా నిర్ణయం తీసుకోవాలని పేర్కొన్నాడు.

''దీర్ఘకాలిక దృక్కోణంలో భారత క్రికెట్‌ను చూస్తే టీమిండియా బౌలింగ్ మెరుగ్గా ఉందనిపిస్తుంది. కుల్‌దీప్ యాదవ్ పునరాగమనం, గత టెస్టులో ఆకాశ్ దీప్ నిలకడగా రాణించారు. ఇంగ్లండ్ బ్యాటర్లను కనికరంగా లేకుండా ఒత్తిడిలోకి నెడుతున్నారు. బుమ్రా, సిరాజ్, ఆకాశ్ దీప్‌తో పాటు ముగ్గురు స్పిన్నర్లు సత్తాచాటుతున్నారు. నిలకడైన ఫామ్‌ను చూస్తుంటే జట్టు నుంచి వాళ్లు బయటకు వెళ్లడానికి ఆస్కారమే లేదు''
''ఇక బ్యాటింగ్ విషయానికొస్తే.. తమ సామర్థ్యంతో టెస్టుల్లో భారీ పరుగులు చేస్తున్నారు. ఇది మంచి సంకేతం. సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్ తమ కెరీర్‌లో గొప్ప పునాది వేశారు. ఎంతో ఉత్తేజకరమైన నైపుణ్యం ఉంది. అయితే మనం మరికొంత కాలం ఎదురుచూడాలి. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ వంటి ఇతర దేశాల్లో వాళ్లు సత్తాచాటాలి. అప్పుడే విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, ఛెతేశ్వర్ పుజారా వంటి ఆటగాళ్ల స్థానంలో కొనసాగేది ఎవరని తెలుస్తుంది'' అని సంజయ్ మంజ్రేకర్ పేర్కొన్నాడు.
ఇంగ్లండ్ టెస్టు సిరీస్‌లో సర్ఫరాజ్, ధ్రువ్ జురెల్ మూడు టెస్టులు ఆడారు. సర్ఫరాజ్ ఖాన్ అయిదు ఇన్నింగ్స్‌ల్లో 50 సగటుతో 200 పరుగులు చేశాడు. ధ్రువ్ జురెల్ నాలుగు ఇన్నింగ్స్‌ల్లో 63 సగటుతో 190 పరుగులు చేశాడు.