అఫ్గానిస్థాన్‌తో భారత్ మూడు టీ20ల సిరీస్ ఆడనుంది. మొహాలి వేదికగా ఇవాళ తొలి మ్యాచ్ ప్రారంభం కానుంది. 427 రోజుల తర్వాత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తిరిగి టీ20లు ఆడనున్నాడు. మరోవైపు విరాట్ కోహ్లి వ్యక్తిగత కారణాలతో తొలి మ్యాచ్‌కు దూరమయ్యాడు. టీ20 ప్రపంచకప్ ముందు భారత్ ఆడే ఆఖరి టీ20 సిరీస్ ఇదే కావడంతో సిరీస్‌పై ఆసక్తి పెరిగింది. మెరుగైన ప్రదర్శనతో జట్టులో తమ స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలని యువప్లేయర్లు పట్టుదలతో ఉన్నారు.
అయితే అఫ్గానిస్థాన్ సిరీస్‌లో ప్రదర్శన కంటే ఐపీఎల్ ఫామ్ ఆధారంగానే టీ20 ప్రపంచకప్‌కు టీమిండియాను ఎంపిక చేస్తారని దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. జూన్‌లో టీ20 ప్రపంచకప్ జరగనుందని, ఆ మెగాటోర్నీకి ఇంకా చాలా సమయం ఉండటంతో అఫ్గాన్ సిరీస్‌ను పెద్దగా పరిగణనలోకి తీసుకోరాని అన్నాడు. అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా టీ20 ప్రపంచకప్‌కు ఆతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే.

''ఫామ్‌ను అంచనా వేయడంలో ఐపీఎల్ కీలకంగా అవుతుందని భావిస్తున్నా. జనవరిలో అఫ్గానిస్థాన్ సిరీస్ ఉంది. కానీ ప్రపంచకప్ జరిగేది జూన్‌లో. కాబట్టి మార్చి, ఏప్రిల్, మే నెలల్లో చేసే ప్రదర్శనను ప్రధానంగా పరిగణనలోకి తీసుకుంటారు. అయితే ఐపీఎల్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి సాధారణ ప్రదర్శన కనబరిచినా జట్టులో ఎంపిక చేయాలి. ప్రతి మ్యాచ్‌లో ఎవరూ పరుగులు చేయలేరు. 14 మ్యాచ్‌ల్లో అయిదింట్లో సత్తాచాటిన వారి అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని సెలక్ట్ చేయాలి. జట్టుతో వారు ఉండాలి. వారిద్దరు కనీసం డగౌట్‌లో ఉన్నా జట్టు ఎంతో విశ్వాసంగా ఆడుతుంది'' అని గవాస్కర్ అన్నాడు.
కాగా, వచ్చే ఐపీఎల్ సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభమవుతుందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ముంబయి ఇండియన్స్ కెప్టెన్సీ బాధ్యతలను హార్దిక్ పాండ్య అందుకోవడంతో రోహిత్ శర్మ కేవలం బ్యాటర్‌గానే బరిలోకి దిగనున్నాడు. మరోవైపు విరాట్ కోహ్లి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున మరోసారి ఓపెనర్‌గానే ఆడే అవకాశం ఉంది. టీమిండియాలో వన్‌డౌన్‌లో ఆడే కోహ్లి ఐపీఎల్‌లో ఓపెనర్‌గా సత్తాచాటిన విషయం తెలిసిందే.