'నేను ఆడితే వార్త.. ఆడకపోతే ఇంకా పెద్ద వార్త'
హైదరాబాద్: ఆస్ట్రేలియాతో జరిగే మూడు టీ20ల సిరీస్‌కు సెలక్టర్లు ప్రకటించిన జట్టులో వెటరన్ సీమర్ ఆశిష్ నెహ్రా ఎంపికైన సంగతి తెలిసిందే. ఢిల్లీకి చెందిన 38 ఏళ్ల ఆశిష్ నెహ్రా కెరీర్ ఆసాంతం విమర్శలను తానెప్పుడూ పట్టించుకోలేదని కొత్తగా ఇప్పుడు ఏమంటారోననే బెంగలేదని స్పష్టం చేశాడు.
ఈ ఏడాది ఆరంభంలో ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో బరిలో దిగిన నెహ్రాకు ఐపీఎల్‌లో గాయమైంది. ఎనిమిది నెలల తర్వాత టీమిండియాలో చోటు దక్కించుకోవడంపై నెహ్రా ఆనందం వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా ఢిల్లీలో నెహ్రా మాట్లాడుతూ తన సుదీర్ఘ కెరీర్‌లోని ఆసక్తికర విషయాల్ని పంచుకున్నాడు.

నా సంగతి కోహ్లీకి, సెలక్టర్లకు తెలుసు
టీమిండియాకు ఆడటం ఎవరికి ఆనందంగా ఉండదు? మూడు మ్యాచ్‌ల కోసం ఎంపిక చేశారు. ఒక్కో మ్యాచ్ గురించి ఆలోచిస్తా. నేను ఆడితే వార్త.. ఆడకపోతే ఇంకా పెద్ద వార్త. నేను తిరిగి భారత్‌కు ఆడితే ఎవరు నొచ్చుకుంటారో మరి! అయినా నేనెప్పుడు విమర్శలను, విమర్శకులను పట్టించుకోను. నా సత్తా ఏంటో డ్రెస్సింగ్ రూమ్‌కు తెలుసు. ఇక ఈ వయసులో పెద్ద గా లక్ష్యాలేవీ పెట్టుకోను. ఈ సమయంలో నా ట్రెయినింగ్ షెడ్యూల్‌ను పూర్తిచేశా. నేనేం చేస్తున్నానో కెప్టెన్ విరాట్, చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్‌కు పూర్తిగా తెలుసు. జట్టులో ఉంటే నా వంతు నేను కష్టపడతాను.

వచ్చే ఏడాది ఫిబ్రవరి 19 ఏళ్ళు
చాలా మందికి తెలుసో, తెలియదో కానీ నేను 1999లో అజహరుద్దీన్ కెప్టెన్సీలో జట్టులోకి వచ్చాను. బహుశా నేను, హర్భజన్ సింగ్ తప్ప ఆయన హయాంలో జాతీయ జట్టులోకి వచ్చిన క్రికెటర్ ఇప్పటికీ ఆడుతున్నట్టు కనిపించడంలేదు. అజ్జూ ఆధ్వర్యంలో ఆట మొదలుపెట్టిన ఆటగాడిని ప్రస్తుత జట్టులో నేనొక్కడినే. వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి నా అంతర్జాతీయ కెరీర్‌కు 19 ఏళ్ళు పూర్తవుతాయి. కాబట్టి కెరీర్‌లో ఈ దశలో డబ్బుల గురించి ఆడాల్సిన అవసరం నాకు లేదు. ఇప్పటికే నాకు 12 సార్లు సర్జరీలు అయ్యాయి. అన్ని శస్త్రచికిత్సలయ్యాక కూడా కోలుకొని క్రికెట్ ఆడటం కూడా అరుదేనేమో? అయితే నా ఉదయం దినచర్య ప్రాక్టీస్‌తో మొదలవుతుంది. ఫిట్‌నెస్‌తో కొనసాగుతుంది. విరామం లేకుండా ఇలా చేస్తున్నందుకేనేమో ఇంకా నేను క్రికెట్ ఉత్సాహంగా ఆడగలుగుతున్నాను.

ట్విట్టర్‌లో నా గురించి
ట్విట్టర్‌కు, ఫేస్‌బుక్‌కు నేను దూరం. నిజానికి ట్విట్టర్‌లో నా గురించి ఎమరు ఏమనుకుంటున్నారో నిజంగా నాకు తెలియదు. నా వయసు గురించి చేసే కామెంట్లను పట్టించుకోను. ఇప్పుడు నేను టీమిండియా సభ్యుడిని. శిక్షణ షెడ్యూల్‌ను అనుసరించడం, ఫిట్‌నెస్ కాపాడుకోవడం, బౌలింగ్‌ను మెరుగుపరుచుకోవడంపైనే దృష్టి పెడతా. కెప్టెన్, చీఫ్ సెలెక్టర్ ఏ నమ్మకంతో నన్ను సెలెక్ట్ చేశారో.. దాన్ని నిలబెట్టుకోవడమే నా ధ్యేయం. ఫాస్ట్ బౌలింగ్‌పై జహీర్‌ను సలహా అడిగినప్పుడు.. వేగం తగ్గించుకుని బంతులు వైవిధ్యంగా వేయాలని సలహా ఇచ్చాడు. అందుకే ఈవయసులో కూడా స్థిరంగా గంటకు 140 కి.మీ వేగంతో బౌలింగ్ వేయగల సత్తా ఉంది.

జహీర్ ఖాన్ కెరీర్ ఆసాంతం టెస్టులాడాడు
'జహీర్ ఖాన్ కెరీర్ ఆసాంతం టెస్టులు ఆడాడు. అద్భుతమైన బౌలింగ్ అతడి సొంతం. ఐదు రోజుల మ్యాచ్ ఆసాంతం 80 శాతం సామర్థ్యంతో బౌలింగ్ చేయాలి కాబట్టి శక్తిని కాపాడుకోవాలి. అందువల్ల 80 శాతం మాత్రమే తన శక్తిని వినియోగించుకుని బౌలింగ్ వేసేవాడు. అయినా అవి బ్యాట్స్‌మెన్లను ఇబ్బంది పెట్టేవి. నా వరకైతే నేను కేవలం టి20లకే పరిమితమయ్యా. నా బౌలింగ్ యాక్షన్ కూడా అసాధారణమైంది కాదు. అలాగే 80 శాతం సత్తా కూడా నాలో లేదు. మ్యాచ్ మొత్తమ్మీద 24 బంతులు మాత్రమే వేయగలం. అందువల్ల పూర్తిస్థాయిలో బౌలింగ్ చేయాల్సి ఉంటుంది. బహుశా ఓ సాధారణ బౌలింగ్ యాక్షన్ కలిగివుండటం వల్లేనేమో ఈ వయసు లోనూ తేలిగ్గా బౌలింగ్ చేయగలుగుతున్నా' అని నెహ్రా చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications