మాంచెస్టర్ : బంగ్లాదేశ్ లో ఉగ్రదాడుల తర్వాత.. అక్కడ నిర్వహించే మ్యాచ్ లకు హాజరవడానికి క్రికెటర్లు కాస్త వెనుకా ముందాడాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే.. బంగ్లా టూర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఇంగ్లండ్ (ఈసీబీ బోర్డు).. టూర్ పట్ల క్రికెటర్లకు అభ్యంతరాలుంటే మూడో రోజుల్లోకి ఈసీబీకి వెల్లడించాలని డెడ్ లైన్ విధించింది.
అంతేకాదు.. ఒకవేళ బంగ్లా టూర్ కు వెళ్లడానికి సదరు క్రికెటర్స్ నిరాకరించిన యెడల, వారి స్థానంలో మరో క్రికెటర్ కు అవకాశం కల్పిస్తామని, వాళ్లు గనుక రాణిస్తే టూర్ ను తిరస్కరించే క్రికెటర్లకు భవిష్యత్తులో రిస్క్ తప్పదని హెచ్చరించింది. దీంతో ఇంగ్లండ్ జట్టులో స్థానం కోల్పోకుండా ఉండాలంటే.. ఖచ్చితంగా టూర్ కు హాజరవాల్సిన పరిస్థితి నెలకొంది.

కాగా, ఈసీబీ ఆదేశాలపై ఇప్పటికే స్పందించిన టెస్టు కెప్టెన్ అలిస్టర్ కుక్, మెయిన్ అలీ, క్రిస్ జోర్డాన్.. టూర్ కు ఓకె చెప్పేశారు. అయితే వన్డే కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ నుంచి మాత్రం ఇప్పటివరకు స్పష్టమైన సమాచారమేది రానట్టుగా తెలుస్తోంది. ఈ విషయంలో కల్పించుకున్న ఆండ్రూ స్ట్రాస్.. ఒకవేళ బంగ్లా టూర్ కు గనుక మోర్గాన్ కు ఓకె చెబితే, అనవసరంగా భయపడం మానేసి ఆటపై ఫోకస్ చేయాలని సూచించాడు.