
హైదరాబాద్: కొత్త రకం ట్వీట్లతోనే కాదు. కొత్త రకం ఆటతోనూ సెహ్వాగ్ కట్టిపడేయగలడని నిరూపించాడు. గురువారం క్రికెట్ చరిత్రలోనే తొలిసారిగా గడ్డ కట్టిన సరస్సుపై టీ20 మ్యాచ్ జరిగింది. ఉష్ణోగ్రత -3డిగ్రీలు ఉండగా బంతిని మంచు మైదానంపై పరుగులు పెట్టించారు బ్యాట్స్ మెన్ లు. ఇక సెహ్వాగ్ చలికి ఏ మాత్రం చలించలేదు.
క్రీడాకారులంతా చేతులకు గ్లౌజులు తొడుక్కుని, ఒంటి నిండా స్వెట్టర్, చలిని దరికి చేరనివ్వని దుస్తులతో మంచుపై టీ20 క్రికెట్ ఆడారు. సెయింట్ మారిట్జ్‌లో రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో సెహ్వాగ్ నాయకత్వంలోని ప్యాలెస్ డైమండ్ జట్టుకు షాహిద్ అఫ్రిదీ కెప్టెన్సీలోని రాయల్స్ జట్టుకు మ్యాచ్ జరిగింది.
ఈ చలి పోరులో రాయల్స్ జట్టు 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన డైమండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ (62 ) మంచు మైదానంలోనూ ఇరగదీశాడు. ఆండ్రూ సైమండ్స్ (40), కైఫ్ (19) జోగీందర్ (18) మేమింతే అని నిరూపించారు.
ఈ టోర్నీలో తొలి బంతికే బౌండరీ, అర్ధసెంచరీని సిక్సర్‌తో సాధించి సెహ్వాగ్ తనదైన శైలిలో రెచ్చిపోయాడు. 165 పరుగుల విజయ లక్ష్యాన్ని రాయల్స్ జట్టు 15.2 ఓవర్లలో ఛేదించింది. ఓవైస్ షా (34 బంతుల్లో 74 నాటౌట్), కల్లిస్ (36), ఎలియట్ (21 నాటౌట్) రాణించారు. మరో సారి ఇదే జట్ల మధ్య రెండో టీ20 శుక్రవారం జరగనుంది.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.