
కోల్‌కతా: తొలిసారి గులాబీ బంతితో ఫ్లడ్‌లైట్ల వెలుతురులో మ్యాచ్ ఆడిన టీమిండియా తమ మొదటి డే/నైట్ మ్యాచ్‌లో చిరస్మరణీయ విజయం సాధించింది. చాలా రోజుల తర్వాత క్రికెట్ ప్రేమికులంతా ఎంతో ఆసక్తిగా చూసిన సంప్రదాయ ఫార్మాట్ మ్యాచ్‌ను ఏకపక్షంగా సొంతం చేసుకుంది. బంగ్లాతో రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ఆదివారం ముగిసిన రెండో టెస్ట్ మ్యాచ్‌లో భారత్ ఇన్నింగ్స్ 46 పరుగుల తేడాతో జయభేరి మోగించి 2-0తో సిరీస్ చేజిక్కించుకుంది.
బంగ్లాతో సిరీస్ క్లీన్‌స్వీప్ చేయడం ద్వారా టీమిండియాకు మరో 120 పాయింట్లు లభిం చాయి. దాంతో భారత్ మొత్తం పాయింట్లు 360కి చేరాయి. తొమ్మిది దేశాలు తలపడుతున్న ఐసీసీ టెస్ట్ చాంపియన్‌షిప్‌లో కోహ్లీసేన ఇప్పటివరకు తలపడిన మూడు సిరీస్‌లలో అప్రతిహత విజయాలతో దూసుకుపోతోంది. వెస్టిండీస్‌లో 2-0తో సిరీస్ కైవసం చేసుకున్న భారత్..స్వదేశంలో సౌతాఫ్రికానూ 3-0తో చిత్తు చేసింది. ఒక్కో సిరీస్‌కు 120 పాయింట్లు లభించాయి.
పాకిస్థాన్‌పై తొలి టెస్టులో విజయం సాధించిన ఆస్ట్రేలియా (116 పాయింట్లు) రెండో స్థానానికి చేరింది. న్యూజిలాండ్, శ్రీలంక చెరో 60 పాయింట్లతో పట్టికలో వరుసగా మూడో, నాలుగో స్థానాల్లో ఉన్నాయి.. ఇంగ్లండ్ 56 పాయింట్లతో ఉంది. పాకిస్థాన్ టెస్ట్ చాంపియన్‌షిప్‌లో తొలి సిరీస్‌ను ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఆడుతోంది. బంగ్లాదేశ్, వెస్టిండీస్, సౌతాఫ్రికా తమ తొలి సిరీస్‌లో పాయింట్లు దక్కించుకోలేకపోయాయి. లీగ్ పూర్తయ్యేసరికి తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు జూన్ 2021లో ఇంగ్లండ్‌లో జరిగే ఫైనల్లో తలపడతాయి.
రెండో టెస్ట్ గెలుపుతో వరుసగా నాలుగు టెస్టుల్లో ఇన్నింగ్స్ తేడాతో విజయాలు సాధించిన తొలి జట్టుగా కోహ్లీ సేన చరిత్రకెక్కింది. అంతేకాదు స్వదేశంలో వరుసగా 12వ సిరీస్ కొల్లగొట్టి టాప్‌లో నిలిచింది. గతంలో (2013) వరుసగా ఆరు టెస్ట్ మ్యాచ్‌లు నెగ్గిన భారత్.. ఇప్పుడు ఆ సంఖ్యను ఏడుకు పెంచుకుంది. భారత గడ్డపై అతితక్కువ బంతుల్లో (968) ముగిసిన మ్యాచ్ ఇదే. గతేడాది ఆఫ్ఘనిస్థాన్‌పై 1028 బంతుల్లో భారత్ గెలిచింది.