
అహ్మదాబాద్: ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. ఇన్నింగ్స్ 25 పరుగుల తేడాతో విజయ ఢంకా మోగించింది. ఈ రోజు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 365 పరుగులకు ఆలౌటవ్వడంతో.. రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఇంగ్లండ్ 135 పరుగులకే పరిమితమైంది. భారత్ ఆధిక్యమైన 160 పరుగులను కూడా సమం చేయలేకపోయింది. స్పిన్నర్లు అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్ ఇద్దరూ ఐదు వికెట్లు తీసి భారత విజయంలో కీలక పాత్ర పోషించారు. ఈ ఒక్క విజయంతో భారత్ టాప్ లేపింది.
నాలుగు టెస్టుల సిరీస్‌ని 3-1తో చేజిక్కించుకున్న టీమిండియా వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్లో న్యూజిలాండ్‌తో తలపడనుంది. పాయింట్ల పట్టికలో 72.2% విజయాలతో నెం.1 స్థానంలో భారత్ ఉండగా.. 70.0% విజయాలతో న్యూజిలాండ్ రెండో స్థానంలో నిలిచింది. ఇక రెండు జట్ల మధ్య ఇంగ్లండ్‌లోని లార్డ్స్ స్టేడియం వేదికగా జూన్ 18 నుంచి 22 వరకూ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. గెలిచిన జట్టు ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌గా నిలుస్తుంది. వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ నిర్వహించడం ఇదే మొదటిసారి అన్న విషయం తెలిసిందే.
వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్‌లో భాగంగా మొత్తం ఆరు సిరీస్‌లు ఆడిన భారత్.. 12 మ్యాచ్‌లను గెలిచింది. నాలుగింట్లో ఓడింది. ప్రస్తుతం భారత్ ఖాతాలో 560 పాయింట్లు ఉన్నాయి. ఇక న్యూజిలాండ్ 420 పాయింట్లతో రెండవ స్థానంలో ఉన్నది. 5 సిరీస్‌లు ఆడిన న్యూజిలాండ్ ఏడు టెస్టుల్లో గెలవగా.. 4 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, పాకిస్థాన్ ఆ తర్వాత స్థానాల్లో నిలిచాయి.
వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌ను 2019, ఆగస్టు 1న ఐసీసీ కొత్తగా ప్రారంభించింది. భారత్, ఆస్ట్రేలియా, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, వెస్టిండీస్, బంగ్లాదేశ్, ఇంగ్లండ్ , న్యూజిలాండ్ దేశాలు ఈ ఛాంపియన్‌షిప్‌లో పోటీపడ్డాయి. ప్రతి జట్టూ సొంతగడ్డపై మూడు టెస్టు సిరీస్‌లు, విదేశీ గడ్డపై మూడు సిరీస్‌లు ఆడాయి. ఈరోజు అహ్మదాబాద్ వేదికగా భారత్, ఇంగ్లండ్ మధ్య జరిగిన నాలుగో టెస్టు.. ఛాంపియన్‌షిప్‌లో చివరి మ్యాచ్. దాంతో పాయింట్ల పట్టికలో టాప్-2లో నిలిచిన జట్లు ఫైనల్‌కి అర్హత సాధించాయి. ఇక టెస్టు టీమ్ ర్యాంకులను కూడా ఐసీసీ ప్రకటించింది. భారత్ 122 పాయింట్లతో తొలి ర్యాంక్ సాధించింది. 118 పాయింట్లతో న్యూజిలాండ్ రెండవ ర్యాంక్‌లో నిలిచింది.