కోల్‌కత్తా: ఐసీసీ వరల్డ్ టీ20లో హై ఓల్టేజ్ మ్యాచ్‌గా పేరుగాంచిన భారత్-పాక్ మ్యాచ్ జరగుతుందా లేదా? అని సందేహాలు వ్యక్తం అవుతుండటంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది. అయితే భారత్-పాక్ మ్యాచ్‌కు ఎలాంటి ఇబ్బంది లేదని కోల్‌కత్తాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియం సిబ్బంది తెలిపారు.
కోల్‌కత్తాలో శనివారం ఉదయం నుంచి వర్షం కురుస్తుండడంతో భారత్-పాక్ మ్యాచ్ సందిగ్ధంలో పడింది. మధ్యాహ్నం వరకూ కూడా వర్షం తగ్గకపోవడంతో, ఆకాశం మేఘావృతం అవడంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. దీంతో ఈ మ్యాచ్ వర్షం కారణంగా ఆగిపోతుందేమో అని అభిమానులంతా భావించారు.
అయితే మధ్యాహ్నం సమయానికి వర్షం తగ్గుముఖం పట్టిందని, మ్యాచ్‌కు ఎలాంటి ఇబ్బంది లేదని గ్రౌండ్ సిబ్బంది తాజాగా వెల్లడించారు. అంతేకాదు మ్యాచ్‌కు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసినట్లు సిబ్బంది చెప్పారు. ఐసీసీ టోర్నీలోనే హై ఓల్టేజ్ మ్యాచ్‌గా మరికొద్ది గంటల్లో మొదలవనుంది.
కోల్‌కత్తాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో శనివారం సాయంత్రం 7:30 గంటలకు భారత్-పాక్ జట్ల మధ్య మ్యాచ్ జరుగనుంది. అయితే, శనివారం ఉదయం అక్కడ భారీవర్షం పడింది. దీంతో సాయంత్రానికి వాతావరణం ఎలా ఉంటుందోనన్న ఆందోళన ఆటగాళ్లతో పాటు అభిమానుల్లో కూడా మొదలైంది.
వార్మప్ మ్యాచ్‌ల నుంచి ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఏ మ్యాచ్‌కీ వర్షం ఆటంకం కలిగించలేదు. కాగా అనూహ్యంగా శనివారం ఉదయం మాత్రం కోల్‌కతాలో వర్షం పడటంతో.. ఏం జరుగుతుందోనని అంతా వరుణదేవుడిని ప్రార్థిస్తున్నారు. ఈ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు.
టోర్నీలో భాగంగా భారత్ సెమీస్‌కు చేరుకోవాలంటే ఈ మ్యాచ్‌లో తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాగా పాకిస్థాన్ ఇప్పటికే బంగ్లాదేశ్‌ను ఓడించి ముందంజలో ఉంది. టోర్నీలోకి టైటిల్ ఫేవరేట్‌గా బరిలోకి దిగిన టీమిండియా న్యూజిలాండ్ చేతిలో ఓటమిపాలైంది.