ICC World Cup 2027: ఐసీసీ వరల్డ్ కప్ 2027పై బిగ్ అప్ డేట్ వెలువడింది. దక్షిణాఫ్రికా ఆతిథ్యాన్ని ఇస్తోన్న బిగ్గెస్ట్ క్రికెట్ ఈవెంట్ ఇది. దీనిపై క్రికెట్ సౌత్ ఆఫ్రికా (CSA) తన ప్రణాళికలను ప్రకటించింది. ఈ టోర్నమెంట్‌లో మొత్తం 55 మ్యాచ్ లు జరుగనున్నాయి. ఇందులో 44.. దక్షిణాఫ్రికాలో మిగిలిన 10 మ్యాచ్‌లు జింబాబ్వే, నమీబియాల్లో నిర్వహించనున్నారు.
సుదీర్ఘ విరామం తరువాత ఐసీసీ వరల్డ్ కప్ టోర్నమెంట్ కు దక్షిణాఫ్రికా ఆతిథ్యాన్ని ఇస్తోంది. 2003లో చివరిసారిగా వరల్డ్ కప్ మ్యాచ్ లు జరిగాయి ఇక్కడ. అప్పట్లో నమీబియా లేదు. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, కెన్యాల్లో మ్యాచ్ లు జరిగాయి. ఈ దఫా కెన్యాకు బదులుగా నమీబియా వచ్చి చేరింది.

దక్షిణాఫ్రికాలో
వాండరర్స్ స్టేడియం- జోహన్నెస్‌బర్గ్, సెంచూరియన్ పార్క్- ప్రిటోరియా, న్యూలాండ్స్ క్రికెట్ గ్రౌండ్- కేప్ టౌన్, కింగ్స్‌మీడ్ క్రికెట్ గ్రౌండ్- డర్బన్, సెయింట్ జార్జ్ పార్క్- క్వెబెర్హా, మాంగాంగ్ ఓవల్- బ్లూయెమ్ ఫోంటెయిన్, బఫెలో పార్క్- ఈస్ట్ లండన్ లల్లో వరల్డ్ కప్ మ్యాచ్ లు జరుగుతాయి.
జింబాబ్వే, నమీబియాల్లో..
జింబాబ్వే బులవాయోలోని క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్, హరారేలోని హరారే స్పోర్ట్స్ క్లబ్ తో పాటు కో- హోస్ట్‌గా అరంగేట్రం చేస్తోన్న నమీబియా మిగిలిన 10 మ్యాచ్ లకు ఆతిథ్యాన్ని ఇవ్వనుంది. నమీబియా క్రికెట్ గ్రౌండ్, విండ్‌హోక్‌లోని యునైటెడ్ గ్రౌండ్‌లలో ఆయా మ్యాచ్ లు జరుగుతాయి.
ఐసీసీ వరల్డ్ కప్ 2027లో 14 జట్లు తలపడనున్నాయి. వీటిని ఏడు జట్లు చొప్పున రెండు గ్రూపులుగా విభజించారు. ప్రతి గ్రూప్ నుండి మొదటి మూడు స్థానాల్లో నిలిచిన జట్లు సూపర్ సిక్స్ దశకు చేరుకుంటాయి. ఆ తరువాత సెమీ ఫైనల్స్, ఫైనల్స్ లల్లో అమీ తుమీ తేల్చుకుంటాయి.