దేశ విభజన జరిగిన నాటినుంచి భారత్ పాక్ మధ్య ఏ చిన్న ఘటన జరిగినా అది పెద్ద చర్చకు దారితీసేది. రెండు దేశాల మధ్య రాజకీయ సంబంధాలు, అంశాలను పక్కనబెడితే.. క్రీడలు మాత్రం చాలా ఆసక్తికరంగా ఉంటాయి. అసలు ప్రపంచంలో ఏ రెండు దేశాల మధ్య జరిగే క్రీడలకు ఈ స్థాయి క్రేజ్ ఉండదు. మరి అట్లుంటది ఇండియా - పాక్ క్రికెట్ మ్యాచ్ అంటే. అది క్రికెట్ అయినా, హాకీ అయినా మరే క్రీడైనా సరే. దాయాదుల మధ్య పోరు ధూంధాం అన్నట్లుంటది.
ఇక ఆగష్టు 30వ తేదీ నుంచి ఆసియా కప్ క్రికెట్ ప్రారంభం అవుతుంది. ఆసియా కప్‌లో పేరుకు ఇతర దేశాలున్నప్పటికీ ఫోకస్ మాత్రం భారత్ పాక్ మ్యాచ్ పైనే ఉంటుంది. దాయాదుల పోరు మామూలుగా ఉండదు. ఇలాంటి మ్యాచ్‌లను స్టేడియంకు వెళ్లి ప్రత్యక్షంగా చూస్తేనే మజా ఉంటుంది. గెలుపోటములు తర్వాత సంగతి.. కానీ మ్యాచ్ ఆసాంతం స్టేడియంలో ఎన్నో ఎమోషన్స్ దర్శనమిస్తాయి. బంతి బౌండరీ దాటిందంటే కేకలు ఈలలు గోలలు. అదే వికెట్ పడిందంటే ఒక జట్టు అభిమానుల మౌనం, మరో జట్టు ఫ్యాన్స్ కేరింతలు ఇలాంటి ఎన్నో రుచులు అక్కడ కనిపిస్తాయి.

మరి ఇలాంటి మ్యాచ్‌ను ఎవరు మిస్ చేసుకుంటారు చెప్పండి. అదే వరల్డ్ కప్ మ్యాచ్ అయితే ఆ ఎమోషన్స్ వేరే లెవెల్‌లో ఉంటాయి. అక్టోబర్-నవంబర్‌లో వన్డే క్రికెట్ ప్రపంచకప్ జరుగుతుంది. అన్ని మ్యాచ్‌లు ఒక ఎత్తయితే ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ మరో ఎత్తు. అహ్మదాబాద్ వేదికగా నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్ పాకిస్తాన్ మ్యాచ్ అక్టోబర్ 14న జరుగుతుంది. ఇందుకోసం ప్రముఖ ఆన్‌లైన్ టికెట్ సంస్థ బుక్ మై షో (Book My Show) ఆగష్టు 29వ తేదీ టికెట్స్ అందుబాటులోకి తీసుకొచ్చింది. టికెట్స్ పెట్టిన కొన్ని నిమిషాలకే హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. ఇటు ఆన్‌లైన్‌ల్ అటు క్యూలల్లో నిల్చున్న చాలామంది టికెట్లు దొరక్క నిరాశతో వెనుదిరిగారు.
అయితే ఇప్పుడు టికెట్స్ దొరక్కపోయినా వీరందరికీ మరో అవకాశం ఉంది. సెప్టెంబర్ 3వ తేదీన మరోసారి కౌంటర్స్ ఓపెన్ చేస్తారు.ఆ రోజు రాత్రి 8:00 గంటలకు టికెట్స్ ఆన్‌లైన్‌లో అందుబాటులోకి వస్తాయి.భారత్-పాక్ మ్యాచ్‌కు కనీస టికెట్ ధర రూ.2000 ఉండగా గరిష్ట ధర రూ.లక్షగా ఉంది. ఆన్‌లైన్ టికెట్ల అమ్మకం పూర్తికాగానే ఆఫ్‌లైన్‌లో కూడా టికెట్స్ అమ్మకాలు జరుగుతాయి కానీ, ఇది చాలా తక్కువగా ఉంటాయని సమాచారం.
ఇండియా పాక్ మ్యాచ్‌కు అత్యధికంగా రూ.లక్ష టికెట్ అందుబాటులో ఉంది. ఇది ప్రెసిడెన్షియల్ సూట్స్ లెవెల్ -4 టికెట్లని పిలుస్తారు.ఇక ప్రీమియం - సూట్స్ లెవెల్ -5 మరియు రిలయన్స్ ఎండ్ బాక్స్ టికెట్ ధర రూ.75వేలుగా నిర్ణయించారు.ఇంకెందుకు ఆలస్యం సెప్టెంబర్ 3వ తేదీ రాత్రి 8:30 గంటలకు ఆన్‌లైన్ టికెట్స్ అందుబాటులోకి వస్తాయి. కొనుగోలు చేసి దాయాదుల పోరును స్టేడియంలో ప్రత్యక్షంగా వీక్షించండి. ఎమోషన్స్‌ను మిస్ కాకండి.