న్యూఢిల్లీ: ఐసీసీ ప్రపంచకప్‌లో భాగంగా శనివారం నాడు భారత్, యూఏఈ తలపడనున్నాయి. ప్రత్యర్థి యూఏఈ జట్టులో భారత్‌కు చెందిన ఇద్దరు ఆటగాళ్లు ఉన్నారు. వారు కృష్ణ చంద్రన్ కరాట్, స్వప్నిల్ పాటిల్. కృష్ణ కరాట్ కేరళలోని కొల్లంగోడ్ గ్రామానికి చెందిన వాడు. బెంగళూరులో స్కూల్ క్రికెట్ ఆడిన ఇతను కేరళ ఆండర్-19 జట్టుకు ఆడాడు.
2008లో విజయ్ హజారే ట్రోఫీలో తమిళనాడుతో మ్యాచ్ ఆడి 35 పరుగులు చేశాడు. అశ్విన్, మురళీ విజయ్, బద్రీనాథ్ వంటి హేమాహేమీలున్న తమిళనాడుతో మ్యాచులో కేరళ 91 పరుగులకే ఆలౌట్ కాగా. కృష్ణ కరాటేది టాప్ స్కోర్. ఇదిలా ఉండగా, కృష్ణ కరాట్‌కు కేరళ వన్డే జట్టులో చోటు దక్కలేదు.
ఆ తర్వాత కుటుంబ పోషణ భారం కావడంతో దుబాయ్ వెళ్లాడు. ఎమిరేట్స్ ఎయిర్ లైన్స్ కార్గో విభాగంలో కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్‌గా పని చేశాడు. అక్కడ మాజీ క్రికెటర్ అజయ్ జడెజా సోదరుడు నరేంద్ర జడెజా అతడికి బాస్. కృష్ణ కరాట్ ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాడు.

దీంతో అతను యూఏఈ జాతీయ జట్టులో చోటు దక్కించుకున్నాడు. స్కూల్ క్రికెట్లో ఊతప్పతో కలిసి ఆడాడు. స్టువార్ట్ కాలేజీలో బిన్నీ ఇతని సహచరుడు. శ్రీశాంత్ అండర్-19 క్రికెట్ ఆడే సమయంలో ఇద్దరు ఒకే దగ్గర ఉండేవారు. భారత్‌తో మ్యాచ్ నేపథ్యంలో అతను స్పందిస్తూ.. భారత్‌తో ఆడేందుకు ఎదురు చూస్తున్నానని అన్నాడు.
యూఏఈ జట్టులో ఉన్న మరో భారత క్రికెటర్ స్వప్నిల్ పాటిల్. రోహిత్ శర్మ, అజింక్యా రహానేలతో కలిసి ముంబై అండర్-19 తరపున ఆడాడు. 2006లో దుబాయ్ సంస్థలో ఉద్యోగిగా చేరాడు. నాలుగేళ్ల తర్వాత యూఏఐ జట్టులో చోటు దక్కించుకున్నాడు.
ఇక, యూఏఈ జట్టులోని వారు చాలామంది ఇతర దేశాల నుండి వచ్చిన వారే కావడం గమనార్హం. షైమన్ అన్వర్, అంజద్ అలీ, నాసిర్ అజీజ్, ఖుర్రం ఖాన్, సక్లెయిన్ హైదర్, రోహన్ ముస్తఫా, మహ్మద్ నవీద్, షాజద్‌లు పాకిస్తాన్‌లో పుట్టి పెరిగిన వారు. బెరంగర్, గురుజ్‌లు శ్రీలంక దేశవాళీ మ్యాచులు ఆడారు.