రెండో పరుగు కోసం
అయితే రెండో పరుగు కోసం ప్రయత్నించిన సమయంలో నాన్‌స్ట్రైకర్ దీప్తి సరిగా స్పందించలేదు. ఈ సమయంలో హర్మన్ ప్రీత్ గట్టిగా కేకలు వేయడంతో దీప్తి శర్మ పరుగెత్తడంతో రెండో పరుగు పూర్తయి కౌర్ సెంచరీ సాధించింది. దీంతో దీప్తి కూడా రనౌట్ కాకుండా బయటపడింది. ఈ సమయంలో కౌర్ తన కోపాన్ని దీప్తి శర్మపై ప్రదర్శించింది. కౌర్ గట్టిగా అరిచి తన హెల్మెట్‌ని నేలకేసి కొట్టడంతో దీప్తి శర్మ ఏడ్చినంత పని చేసింది. భారత ఇన్నింగ్స్ తర్వాత కౌర్ మాట్లాడుతూ ఆ సమయంలో తన ఆవేశాన్ని నియంత్రించుకోలేకపోయానని, ఆ తర్వాత దీప్తికి సారీ చెప్పినట్లు వెల్లడించింది.

టోర్నీకి ముందే సెమీస్ చేరడమే లక్ష్యంగా పెట్టుకున్నాం
"చాలా ఆనందంగా ఉంది. మేం గెలవడం వల్లే నా ఇన్నింగ్స్ విలువ పెరిగింది. టోర్నీకి ముందు సెమీస్ చేరడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. ఆ తర్వాత అది ఫైనల్‌గా మారింది. టోర్నమెంట్‌లో నాకు ఎక్కువగా బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. ఈ అవకాశాన్ని వాడుకోవాలని భావించాను. దొరికిన బంతిని బాదడమే పనిగా పెట్టుకున్నాను. నా వ్యూహం ఫలించింది" అని మ్యాచ్ అనంతరం కౌర్ పేర్కొంది.
పైనల్లోకి దూసుకెళ్లడంలో కౌర్ కీలకపాత్ర
తన అద్భుతమైన ఇన్నింగ్స్‌తో భారత్ పైనల్లోకి దూసుకెళ్లడంలో కౌర్ కీలకపాత్ర పోషించింది. అంతేకాదు భారత్ తరుపున వన్డేల్లో అత్యధిక స్కోరు చేసిన రెండో బ్యాట్స్ ఉమెన్‌గా దీప్తిశర్మ(188 నాటౌట్) తర్వాత కౌర్ నిలిచింది. ఈ ఏడాది మొదట్లో దీప్తి శర్మ ఐర్లాండ్‌పై ఈ రికార్డు నమోదు చేసింది. ఇక గురువారం నాటి మ్యాచ్‌లో తన అద్భుతమైన ఇన్నింగ్స్‌తో మాచ్ స్వరూపాన్నే మార్చడమే కాదు కంగారులకు దిమ్మతిరిగేలా తన బ్యాట్‌తో సమాధానం చెప్పింది. క్రీజులోకి వచ్చిన దగ్గర నుంచీ స్టేడియం నలువైపులా ఫోర్లు కొడుతూ సెంచరీతో కదం తొక్కింది.

115 బంతుల్లో 171 పరుగులు
115 బంతుల్లో 20 పోర్లు, 7 సిక్సుల సాయంతో 171 పరుగులతో అజేయంగా నిలిచింది. హర్మన్ ప్రీత్ కౌర్ క్రీజులోకి అడుగుపెట్టే సమయానికి భారత్ స్కోరు 9.2 ఓవర్లకు గాను 2 వికెట్లు కోల్పోయి 35 పరుగులు చేసింది. అంతక ముందు మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై సెంచరీ చేసిన కెప్టెన్ మిథాలీ రాజ్ ఒంటరి పోరాటం చేస్తోంది. ఈ సమయంలో తొలి రెండు ఓవర్లు నెమ్మదిగా ఆడిన కౌర్ ఆ తర్వాత తన బ్యాట్‌ని ఝళిపించింది. 21వ ఓవర్ నుంచి ఆట ఏకపక్షంగా సాగింది. తొలి 60 బంతుల్లో 41 పరుగులు చేసిన కౌర్ ఆ తర్వాతి 55 బంతుల్లో 130 పరుగులు సాధించింది.

64 బంతుల్లో అర్ధ సెంచరీ
నాలుగో వికెట్‌కు దీప్తి శర్మతో కలిసి 137 పరుగులు జోడించగా, అయిదో వికెట్‌కు కృష్ణమూర్తితో కలిసి 43 పరుగులు జోడించింది. 64 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసిన కౌర్ సెంచరీ చేరుకోడానికి పట్టిన బంతులు కేవలం 26 మాత్రమే. 100 నుంచి 150కి అవసరమైన బంతులు 17 మాత్రమే. దీనిని బట్టి చూస్తే కౌర్ సెంచరీ చేసిన తర్వాత చెలరేగి ఆడిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రపంచ క్రికెట్‌లో ఎంతోమంది గొప్ప క్రికెటర్లు ఉన్నప్పటికీ కొందరు మాత్రమే చరిత్రలో నిలిచిపోయే ఇన్నింగ్స్ ఆడతారు. అలాంటి ఇన్నింగ్సే గురువారం ఆస్ట్రేలియాపై హర్మత్ ప్రీత్ కౌర్ అడిందని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు.


Click it and Unblock the Notifications