హైదరాబాద్: ఐసీసీ మహిళల ప్రపంచకప్ క్వాలిఫయింగ్ టోర్నీలో భారత్ రెండో విజయాన్ని నమోదు చేసుకుంది. బుధవారం థాయిలాండ్‌తో కొలంబొ క్రికెట్ క్లబ్ గ్రౌండ్‌లో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న థాయిలాండ్ జట్టును భారత బౌలర్లు అతి తక్కువ స్కోరుకే కుప్పకూల్చారు.
వరుసగా వికెట్లు కోల్పోయిన థాయిలాండ్ 30 ఓవర్లలో 55 పరుగులు చేసి ఆలౌటైంది. థాయ్‌లాండ్ క్రీడాకారిణుల్లో నలుగురు పరుగులేమీ చేయకుండానే పెవిలియన్‌కు చేరారు. థాయిలాండ్ క్రీడాకారిణుల్లో చనిదా షుతరింగ్ 12, నాట్టయ బూచమ్‌లు మాత్రమే రెండంకెల స్కోరు చేశారు.

మాన్సి జోషి 3 వికెట్లు తీసుకోగా దీప్తి శర్మ, పూనమ్ యాదవ్, రాజేశ్వరి రెండేసి వికెట్లు తీసుకున్నారు. అనంతరం 56 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఒక వికెట్ కోల్పోయి 12.4 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో 9 వికెట్ల తేడాతో విజయం సాధించిన టీమిండియా గ్రూప్ ఏ పాయింట్ల పట్టికలో తొలిస్థానానికి చేరింది.
ఈ మ్యాచ్‌లో మూడు వికెట్లు తీసిన మాన్సి జోషి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నారు.