హైదరాబాద్: ఐసీసీ ఉమెన్ వరల్డ్ కప్ సందర్భంగా ఏర్పాటు చేసిన విందు సమావేశంలో పాకిస్థాన్ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు దిమ్మదిరిగే పోయే సమాధానం చెప్పిన భారత మహిళ జట్టు కెప్టెన్ మిథాలీరాజ్‌పై కొందరు ప్రశంసలు కురిపిస్తున్నారు. మిథాలీ సరైన సమాధానం చెప్పిందంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
వివరాల్లోకి వెళితే... మహిళల వన్డే వరల్డ్ కప్ - 2017 జూన్ 24 నుంచి ఇంగ్లాండ్‌లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో టోర్నీలో పాల్గొనే జట్ల కెప్టెన్ల కోసం ప్రత్యేక విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ విందుకు భారత కెప్టెన్ మిథాలీ రాజ్ కూడా హాజరయ్యారు.
ఈ ప్రత్యేక విందు కార్యక్రమం అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో పాకిస్థాన్ జర్నలిస్ట్ ఒకరు భారత్, పాకిస్థాన్ జట్టులో మీ అభిమాన క్రికెట్ ఎవరు? అని మిథాలీని అడిగాడు. ఇదే ప్రశ్న పురుష క్రికెటర్‌ని అడుగుతారా? అంటూ తీవ్రంగా స్పందించింది.

మీకు ఇష్టమైన మహిళా క్రికెటర్ ఎవరు? అని పురుష క్రికెటర్లని అడగనప్పుడు.. పురుష క్రికెట్ జట్టులో ఇష్టమైన క్రికెటర్ ఎవరు అని ఎలా అడుగుతారు అంటూ ప్రశ్నించింది. మిథాలీ నోటి వెంట వచ్చిన ఊహించని సమాధానంతో ఆ జర్నలిస్ట్ ఒక్కసారిగా కంగుతిన్నాడు.
కాగా, మిథాలీ సమాధానం నచ్చిన టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా ఆమెను ప్రశంసించింది. 'చంపేశావు పో! వెల్‌డన్' అనే అర్థం వచ్చేలా ట్వీట్ చేసింది. మిథాలీ రాజ్ చెప్పిన సమాధానంపై ఆడమ్ కొలిన్స్, ఆకాశ్ చోప్రా వంటి వారు బాగా చెప్పావంటూ పొగిడ్తలతో ముంచెత్తారు.