
మాంచెస్టర్: భారత జట్టు ఓటమి మిగిల్చిన గాయంపై కారం పూసేలా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ వ్యవహరిస్తోందని అభిమానులు నిప్పులు చెరుగుతున్నారు. సోషల్ మీడియా వేదికగా ఐసీసీపై విరుచుకుపడుతున్నారు. దోషిగా నిలబెడుతున్నారు. దీనికి ప్రధాన కారణం- టీమిండియా వికెట్ కీపర్, మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ మహేంద్రసింగ్ ధోనీని కించపరిచేలా ఓ వీడియోను రూపొందించడమే. మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫొర్డ్‌లో బుధవారం జరిగిన ప్రపంచకప్ తొలి సెమీఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా తన ప్రత్యర్థి న్యూజిలాండ్ చేతిలో 18 పరుగుల తేడాతో పరాజయాన్ని చవి చూసిన విషయం తెలిసిందే.
ఈ మ్యాచ్‌లో ధోనీ రనౌట్ అయ్యాడు. కివీస్ ఫీల్డర్ మార్టిన్ గప్టిల్ విసిరిన డైరెక్ట్ త్రోకు ధోనీ పెవిలియన్ బాట పట్టాడు. ఈ రనౌట్‌ను ఆధారంగా చేసుకుని ఐసీసీ ఓ వీడియోను రూపొందించింది. ఇందులో గప్టిల్‌ను టెర్మినేటర్ సిరీస్ కండల హీరో ఆర్నాల్డ్ ష్క్వార్జ్‌నెగ్గర్‌లా చిత్రీకరించింది. గప్టిల్ స్టంప్స్‌ను గురి చూడటం, వాటిని టార్గెట్‌గా చేసుకుని బంతిని నిప్పు కణికలా విసరడం, వికెట్లకు తగిలిన ఆ బంతి బాంబులా పేలిపోవడం.. ఇవన్నీ గ్రాఫిక్స్ ద్వారా తీర్చిదిద్దింది.
తన అధికారిక ట్విట్టర్‌లో ఈ వీడియోను పోస్ట్ చేసింది. ఈ వీడియో వైరల్‌గా మారినప్పటికీ.. భారత క్రికెట్ అభిమానుల ఆగ్రహానికి గురైంది. ధోనీని కించపరిచేలా దీన్ని చిత్రీకరించారని అంటూ ధ్వజమెత్తుతున్నారు అభిమానులు. ఈ వీడియోను వెంటనే డిలేట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అసలే మ్యాచ్ ఓడిన బాధలో ఉన్నామని, గాయంపై కారం చల్లేలా ప్రవర్తించవద్దని నిలదీస్తున్నారు.