
హైదరాబాద్: అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్‌లోని మౌంట్ మాంగన్యూ వేదికగా జరిగిన ఫైనల్లో మన్‌జోత్ కల్రా సెంచరీతో రాణించడంతో భారత్ 8 వికెట్ల తేడాతో అలవోక విజయాన్ని నమోదు చేసింది. తాజా విజయంతో టీమిండియా నాలుగోసారి వరల్డ్ కప్‌ను గెలిచి చరిత్ర సృష్టించింది.
అంతకముందు 2000, 2008, 2012లలో టీమిండియా అండర్-19 వరల్డ్ కప్ విజేతగా అవతరించింది. 2000లో మహ్మద్ కైఫ్ కెప్టెన్సీలో, 2008లో విరాట్ కోహ్లి కెప్టెన్సీలో, 2012లో ఉన్ముక్త్ చంద్ కెప్టెన్సీలో భారత్ విశ్వవిజేతగా నిలిచింది. ఈ టోర్నీలో ఓటమే ఎరగని టీమిండియా ఫైనల్లో కూడా అద్భుత ప్రదర్శన కనబర్చారు.

తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా 47.2 ఓవర్లలో 216 పరుగులు చేసి ఆలౌటైంది. అనంతరం 217 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 38.5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 220 పరుగులు చేసింది. ఓపెనర్ మన్‌జోత్ కల్రా (101, 102 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సులు)తో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.
విజయం దిశగా భారత్
ఆస్ట్రేలియాతో జరుగుతున్న అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ గెలుపు దిశగా దూసుకెళ్తోంది. 30 ఓవర్లు ముగిసే సమయానికి భారత్ 2 వికెట్లు కోల్పోయి 170 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో కార్లా(85), హార్విక్ దేశాయ్(15) ఉన్నారు. భారత్ విజయానికి ఇంకా 47 పరుగులు కావాలి. ఓపెనర్ మన్‌జోత్ కార్లా సెంచరీకి చేరువయ్యాడు. ఛేదనకు ఇంకా తక్కువ పరుగులే ఉండటంతో భారత అభిమానులు స్టేడియంలో సందడి చేస్తున్నారు.
అప్పుడే మొదలైన సంబరాలు
ఆస్ట్రేలియాతో జరుగుతున్న అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ దూకుడుగా ఆడుతోంది. దీంతో మ్యాచ్ ఇంకా పూర్తి కాకముందే భారత్‌లో సంబరాలు మొదలయ్యాయి. ఢిల్లీలోని అండర్-19 ఆటగాడు మన్‌జోత్ కర్లా ఇంటి ముందు అభిమానులు పెద్ద ఎత్తున చేరుకొని సంబరాలు జరుపుకుంటున్నారు.
అస్ట్రేలియా నిర్దేశించిన లక్ష్యం చాలా చిన్నదని, ఆటగాళ్లందరూ మంచి ఫాంలో ఉన్నారని, భారత్ గెలుపు ఖాయమని మన్‌జోత్ కర్లా తల్లి రంజిత్ కర్లా ధీమా వ్యక్తం చేశారు. మన్‌జోత్ కర్లా హాఫ్ సెంచరీ పూర్తి చేసి, దూకుడుగా ఆడుతున్నాడు. అంతకముందు టాస్ గెలిచిన ఆస్ట్రేలియా 216 పరుగులు చేసిన ఆలౌటైంది.

రెండో వికెట్ కోల్పోయిన భారత్
ఆస్ట్రేలియాతో జరుగుతున్న అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ రెండో వికెట్ కోల్పోయింది. జట్టు స్కోరు 131 పరుగుల వద్ద శుభమాన్ గిల్ (31) పరామ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. గిల్ ఔటైన తర్వాత క్రీజులోకి వికెట్ కీపర్ హార్విక్ దేశాయ్ వచ్చాడు. 25 ఓవర్లు ముగిసే సరికి భారత్ 2 వికెట్లు కోల్పోయి 144 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో దేశాయ్ 4, మన్‌జోత్ కార్లా 70 పరుగులతో క్రీజులో ఉన్నారు.
20 ఓవర్లకు భారత్ 125/1
ఆస్ట్రేలియాతో జరుగుతున్న అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్లో భారత బ్యాట్స్‌మెన్ దూకుడుగా ఆడుతున్నారు. 20 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా ఒక వికెట్ నష్టానికి 125 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో శుభమాన్ గిల్ 30, మన్‌జోత్ కార్లా 56 పరుగులతో క్రీజులో ఉన్నారు. భారత్ విజయానికి ఇంకా 180 బంతుల్లో 82 పరుగులు చేయాలి. చేతిలో ఇంకా 9 వికెట్లు ఉన్నాయి.
మన్‌జోత్ కార్లా 50
అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియాతో జరుగుతోన్న ఫైనల్లో భారత ఆటగాడు మన్‌జోత్ కార్లా హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఇన్నింగ్స్ 16.6 ఓవర్ వద్ద ఇవాన్స్ వేసిన బంతిని ఎదుర్కొన్న కార్లా సింగిల్ తీసి హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. 18 ఓవర్లు ముగిసే సమయానికి భారత్ వికెట్ నష్టానికి 116 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో కార్లా (51), శుభ్‌మన్ గిల్ (26) పరుగులతో ఉన్నారు.
100 పరుగుల మైలురాయిని అందుకున్న భారత్
ఆస్ట్రేలియాతో జరుగుతున్న అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ 100 పరుగుల మైలురాయిని అందుకుంది. 16 ఓవర్లు ముగిసే సరికి భారత్ వికెట్ నష్టానికి 103 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో శుభమాన్ గిల్ 20, మన్‌జోత్ కార్లా 44 పరుగులతో క్రీజులో ఉన్నారు.

తొలి వికెట్ కోల్పోయిన భారత్
మౌంట్ మాంగన్యూ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ తొలి వికెట్ కోల్పోయింది. ఆసీస్ బౌలర్ సూథర్లాండ్ బౌలింగ్‌లో కెప్టెన్ పృథ్వీ షా (29) పరుగుల వద్ద ఔటయ్యాడు. దీంతో 14 ఓవర్లకు గాను భారత్ వికెట్ కోల్పోయి 88 పరుగులు చేసింది. షా ఔటైన తర్వాత శుభమాన్ గిల్ క్రీజులోకి వచ్చాడు.
11 ఓవర్లకు భారత్ 70/0
ఆస్ట్రేలియాతో జరుగుతున్న అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ 11 ఓవర్లకు గాను వికెట్ నష్టపోకుండా 70 పరుగులు చేసింది. ప్రస్తుతం పృథ్వీ షా 29, మన్‌జోత్ కార్లా 34 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకముందు వర్షం కారణంగా మ్యాచ్‌కు కొంత సమయం అంతరాయం కలిగిన సంగతి తెలిసిందే. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ 216 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.
నిలిచిన వర్షం: ప్రారంభమైన మ్యాచ్
వర్షం నిలవడంతో అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ తిరిగి ప్రారంభమైంది. అంతకముందు వర్షం కారణంగా అంపైర్లు మ్యాచ్‌ను తాత్కాలికింగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. వర్షం కారణంగా ఆటనిలిచిపోయే సమయానికి పృథ్వీషా(10), కల్రా(9) పరుగులతో క్రీజులో ఉన్న సంగతి తెలిసిందే.
వర్షం అడ్డంకి: మ్యాచ్‌ను నిలిపివేసిన అంపైర్లు
వర్షం కారణంగా అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌ని అంఫైర్లు తాత్కాలికంగా నిలిపివేశారు. మైదాన సిబ్బంది పిచ్‌ను కవర్లతో కప్పివేశారు. 217 పరుగుల విజయ లక్ష్యంతో భారత్ ఇన్నింగ్స్ ఆరంభించిన కొద్ది సేపటికే వర్షం మొదలైంది. 4 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా వికెట్ ఏమీ నష్టపోకుండా 23 పరుగులు చేసింది.
ఈ సమయంలో వర్షం రావడంతో అంపైర్లు మ్యాచ్‌ను తాత్కాలికింగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. వర్షం కారణంగా ఆటనిలిచిపోయే సమయానికి పృథ్వీషా(10), కల్రా(9) పరుగులతో క్రీజులో ఉన్నారు.
భారత్ విజయ లక్ష్యం 217
మౌంట్ మాంగన్యూ వేదికగా భారత్‌తో జరుగుతున్న అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా 216 పరుగులకే కుప్పకూలింది. దీంతో టీమిండియాకు 217 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లు అద్భుతంగా రాణించారు.
పేసర్ నగర్‌కోటితోపాటు స్పిన్నర్లు చెలరేగడంతో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 47.2 ఓవర్లలో 216 పరుగులు చేసి ఆలౌటైంది. భారత బౌలర్లలో అనుకుల్ రాయ్, కమలేష్ నాగర్ కోటి, శివ సింగ్, ఇషాన్ పోరేల్ తలో రెండు వికెట్లు తీసుకోగా, శివమ్ మావి ఒక వికెట్ తీశాడు.
ఒకానోక దశలో 134 పరుగులకే 3 వికెట్లతో ఉన్న ఆసీస్.. 82 పరుగుల తేడాలో 7 వికెట్లు కోల్పోయింది. ముఖ్యంగా చివరి పది ఓవర్లలో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌పై భారత బౌలర్లు ఆధిపత్యం చెలాయించారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకోగా ఓపెనర్లు జాక్ ఎడ్వర్డ్స్ (28), మాక్స్ బ్రయాంట్ (14) ఆరంభం నుంచే దూకుడుగా ఆడే ప్రయత్నం చేశారు.
అయితే.. ఇషాన్ పోరేల్ వీరిద్దరినీ ఐదు ఓవర్ల వ్యవధిలో పెవిలియన్‌కు చేర్చి టీమిండియాకు బ్రేక్ ఇచ్చాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన జాసన్ (13) నిరాశపరిచినా.. జోనాథన్ మెర్లో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. మరో ఎండ్‌లో పారమ్ ఉప్పల్ (34), నాథన్ (23), విల్ (5) వికెట్లు కోల్పోయినప్పటికీ, బాధ్యతాయుతంగా ఆడి స్కోరు బోర్డుని పరిగెత్తించాడు. అతడి ఇన్నింగ్స్‌తోనే ఆస్ట్రేలియా 200 పరుగులను దాటగలిగింది.
ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌లలో మెర్లో మాత్రమే 76 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అయితే జట్టు స్కోరు 212 పరుగుల వద్ద మెర్లో ఔటవగానే ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన బ్యాట్స్‌మెన్ నిరాశపర్చడంతో ఆస్ట్రేలియా 216 పరుగులు చేసి ఆలౌటైంది.
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ సాగిందిలా:
వరుసగా రెండు వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా
భారత్‌తో జరుగుతున్న అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా 47వ ఓవర్లో వెంట వెంటనే రెండు వికెట్లు కోల్పోయింది. 47వ ఓవర్ తొలి బంతికి ఎవాన్స్ (1) ఔటవ్వగా, ఆ తర్వాత మూడో బంతికి హోల్ట్ (13) పరుగుల వద్ద రనౌట్‌గా వెనుదిరిగాడు. దీంతో 47 ఓవర్లు ముగిసే సరికి ఆస్ట్రేలియా 9 వికెట్లు కోల్పోయి 216 పరుగులు చేసింది.
76 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద మెర్లో ఔట్
భారత్‌తో జరుగుతున్న అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా కీలక వికెట్ కోల్పోయింది. జట్టు స్కోరు 212 పరుగుల వద్ద మెర్లో (76) పరుగుల వద్ద శివ సింగ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. దీంతో 46 ఓవర్లకు గాను ఆస్ట్రేలియా 7 వికెట్లు కోల్పోయి 214 పరుగులు చేసింది.
ఆరో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా
భారత్‌తో జరుగుతున్న అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా ఆరో వికెట్ కోల్పోయింది. జట్టు స్కోరు 191 పరుగుల వద్ద సుథర్లాండ్ (5) శివ్ సింగ్ బౌలింగ్లో కీపర్ హార్విక్ దేశాయ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. దీంతో 41.3 ఓవర్లకు గాను ఆస్ట్రేలియా 6 వికెట్లు కోల్పోయి 191 పరుగులు చేసింది.
ఐదో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా
భారత్‌తో జరుగుతున్న అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా ఐదో వికెట్ కోల్పోయింది. నాథన్ (23) పరుగుల వద్ద శివమ్ మావికి నేరుగా క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం 39.2 ఓవర్లకు గాను ఆస్ట్రేలియా 5 వికెట్లు కోల్పోయి 183 పరుగులు చేసింది.
మెర్లో హాఫ్ సెంచరీ
భారత్‌తో జరుగుతున్న అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా ఆటగాడు మెర్లో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. 60 బంతుల్లో 5 ఫోర్ల సాయంతో మెర్లో హాఫ్ సెంచరీ సాధించాడు. ప్రస్తుతం 34 ఓవర్లకు గాను ఆస్ట్రేలియా 4 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. భారత బౌలర్లలో పొరెల్‌కు రెండు వికెట్లు, నగర్‌కోటి, రోయ్‌కు ఓ వికెట్ దక్కాయి.
నాలుగో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా
మౌంట్ మాంగన్యూ వేదికగా భారత్‌తో జరుగుతున్న అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా నాలుగో వికెట్ కోల్పోయింది. పరామ్ ఉప్పల్ (34) పరుగుల వద్ద అనుకుల్ రాయ్‌కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో అనుకుల్ రాయ్ నాలుగో వికెట్ భాగస్వామ్యానికి తెరదించాడు. ప్రస్తుతం 28.5 ఓవర్లకు గాను ఆస్ట్రేలియా 4 వికెట్లు కోల్పోయి 134 పరుగులు చేసింది.
100 పరుగులు పూర్తి చేసుకున్న ఆస్ట్రేలియా
మౌంట్ మాంగన్యూ వేదికగా భారత్‌తో జరుగుతున్న అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా 100 పరుగులు పూర్తి చేసుకుంది. ప్రస్తుతం 25 ఓవర్లకు ఆస్ట్రేలియా 117/3తో నిలిచింది.
20 ఓవర్లకు ఆస్ట్రేలియా 94/3
మౌంట్ మాంగన్యూ వేదికగా భారత్‌తో జరుగుతున్న అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా 20 ఓవర్లకు గాను 3 వికెట్లు కోల్పోయి 94 పరుగులు చేసింది.
59 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా
భారత్‌తో జరుగుతున్న అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా మూడో వికెట్ కోల్పోయింది. కమలేష్ నాగర్‌కోటి బౌలింగ్‌లో ఆస్ట్రేలియా కెప్టెన్ జాసన్ సాన్యా (13) వికెట్ కీపర్ హార్విక్ దేశాయ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు.
10 ఓవర్లకు ఆస్ట్రేలియా 52/2
భారత్‌తో జరుగుతున్న అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్లో 10 ఓవర్లు ముగిసే సరికి ఆస్ట్రేలియా 2 వికెట్లు కోల్పోయి 52 పరుగులు చేసింది. భారత బౌలర్ ఇషాన్ పోరేల్ రెండు వికెట్లు తీశాడు.
తొలి వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా
మౌంట్ మాంగన్యూ వేదికగా భారత్‌తో జరుగుతున్న అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా తొలి వికెట్ కోల్పోయింది. జట్టు స్కోరు 32 పరుగుల వద్ద ఆసీస్ ఓపెనర్ బ్రియాంత్ (14) ఇషాన్ పోరేల్ బౌలింగ్‌లో అభిషేక్ శర్మకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో 6 ఓవర్లకు ఆస్ట్రేలియా వికెట్ నష్టానికి 32 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో జాక్ ఎడ్వర్ట్స్ (16), జాసన్ పరుగులేమీ చేయకుండా క్రీజులో ఉన్నారు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా
ఐసీసీ అండర్-19 వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ ప్రారంభమైంది. మౌంట్ మాంగన్యూ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. వరుసగా ఆరోసారి అండర్-19 వరల్డ్‌కప్‌లో భారత జట్టు ఫైనల్‌కు చేరుకుంది.
ఈ టోర్నీలో ఇప్పటికే మూడుసార్లు టైటిల్ విజేతగా నిలిచిన టీమిండియా నాలుగో వరల్డ్ కప్‌పై కన్నేసింది. ఇప్పటివరకు ఏ జట్టు కూడా నాలుగు సార్లు విశ్వవిజేతగా అవతరించలేదు. అటు భారత్, ఇటు ఆస్ట్రేలియా ఇప్పటివరకు మూడు సార్లు వరల్డ్‌కప్ టైటిల్‌ను కైవసం చేసుకున్నాయి. దీంతో ఎవరు గెలిస్తే వాళ్లు సరికొత్త చరిత్రను సృష్టిస్తారు.
అయితే ఫైనల్లో ఫేవరేట్‌గా టీమిండియా బరిలోకి దిగుతోంది. మరోవైపు లీగ్ దశ ఓటమికి బదులు తీర్చుకుని.. ఎనిమిదేళ్ల తర్వాత మళ్లీ విశ్వవిజేతగా నిలవాలని ఆసీస్‌కి ఆశిస్తోంది. ఈ టోర్నీలో టీమిండియా ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచుల్లో గెలిచి ఫైనల్లోకి అడుగుపెట్టింది.
అంతకముందు 2000, 2008, 2012లలో టీమిండియా అండర్-19 వరల్డ్ కప్ విజేతగా అవతరించింది. 2000లో మహ్మద్ కైఫ్ కెప్టెన్సీలో, 2008లో విరాట్ కోహ్లి కెప్టెన్సీలో, 2012లో ఉన్ముక్త్ చంద్ కెప్టెన్సీలో భారత్ విశ్వవిజేతగా నిలిచింది. టోర్నీలో పరుగుల వరద పారిస్తున్నశుభ్‌మeన్ గిల్ (341 పరుగులు), కెప్టెన్ పృథ్వీషా (232 పరుగులు), మన్‌జోత్ కల్రా (151)పై భారత్ ఆశలు పెట్టుకుంది. బౌలింగ్‌లోనూ అనుకుల్ (12 వికెట్లు), నాగర్ కోటి (7), అభిషేక్ వర్మ (6) మెరుపులతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషిస్తున్నారు.
మ్యాచ్ డిటేల్స్:
ఇండియా Vs ఆస్ట్రేలియా
ICC Under-19 Cricket World Cup final (ICC U19CWC final)
ఉదయం 6.30 నుంచి స్టార్ స్పోర్ట్స్ 1లో ప్రత్యక్ష ప్రసారం
లైవ్ స్ట్రీమ్: Hotstar.com
జట్ల వివరాలు:
ఇండియా: పృథ్వీ షా (Capt), శుభమాన్ గిల్, ఆర్యన్ జుయాల్, అభిషేక్ శర్మ, అర్షదీప్ సింగ్, హార్విక్ దేశాయ్, మన్‌జ్యోత్ కార్లా, కమలేష్ నాగర్‌కోటి, పంకజ్ యాదవ్, రేయాన్ పరాగ్, ఇషాన్ పోరేల్, హిమాంశు రాణా, అనుకుల్ రాయ్, శివమ్ మావి, శివ సింగ్
ఆస్ట్రేలియా: జాసన్ సాన్యా (కెప్టెన్), విల్ సదర్లాండ్, జేవియర్ బార్ట్లెట్, మాక్స్ బ్రయంట్, జాక్ ఎడ్వర్డ్స్, జాక్ ఎవాన్స్, జారోడ్ ఫ్రీమాన్, ర్యాన్ హాడ్లీ, బాక్టర్ హాల్ట్, నాథన్ మెక్స్వీనీ, జోనాథన్ మెర్లో, లాయిడ్ పోప్, జాసన్ రాల్స్టన్, పరాం ఉప్పల్, ఆస్టిన్ వా