
హైదరాబాద్: న్యూజిలాండ్ వేదికగా జరిగిన ఐసీసీ అండర్-19 వరల్డ్‌కప్‌ను భారత యువ జట్టు గెలవడం ఎంతో సంతోషంగా ఉందని ఆ జట్టు హెడ్ కోచ్, టీమిండియా మాజీ క్రికెట్ దిగ్గజం రాహుల్ ద్రవిడ్ సంతోషం వ్యక్తం చేశారు. మౌంట్ మాంగన్యూ వేదికగా జరిగిన ఫైనల్లో మన్‌జోత్ కల్రా సెంచరీతో రాణించడంతో భారత్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.
మ్యాచ్ అనంతరం రాహుల్ ద్రవిడ్ మాట్లాడుతూ 'కుర్రాళ్ల ఆట పట్ల గర్వంగా ఫీలవుతున్నాను. ఈ విజయంలో సహాయక సిబ్బంది పాత్ర మరవలేనిది. గత 14 నెలలుగా మేం కష్టపడ్డాం. ఈ గెలుపుకు మేం అర్హులమే. ఈ విజయం ఆటగాళ్లకు చిరకాలం గుర్తుండిపోయేదే. ఇక కుర్రాళ్లుకు ఈ విజయం ఓ తీపి గుర్తే కాకుండా వారి భవిష్యత్తును నిర్ధేశిస్తుంది' అని అన్నాడు.
'వారి కెరీర్‌లో ఇలాంటి విజయాలు మరిన్ని అందుకుంటారు. కోచ్‌గా చాలా శ్రద్ధ వహించాను. దీనికి ఇతర సహాయక సిబ్బంది చాలా మద్దతు ఇచ్చారు. గత 14 నెలలుగా 8 మంది సిబ్బందిమి తీవ్రంగా శ్రమించాం. ఈ ప్రయత్నం అద్భుతాన్ని ఇచ్చింది. జట్టు సహాయక సిబ్బందిలో నేను ఉన్నందుకు గర్వంగా ఫీలవుతున్నాను. కుర్రాళ్లకు ఏం కావాలో అదే అందించాం. వారు మైదానంలో అద్భుతంగా రాణించారు' అని ద్రవిడ్ తెలిపాడు.
ఈ విజయంతో టీమిండియా నాలుగోసారి వరల్డ్ కప్‌ను గెలిచి చరిత్ర సృష్టించింది. అంతకముందు 2000, 2008, 2012లలో టీమిండియా అండర్-19 వరల్డ్ కప్ విజేతగా అవతరించింది. 2000లో మహ్మద్ కైఫ్ కెప్టెన్సీలో, 2008లో విరాట్ కోహ్లి కెప్టెన్సీలో, 2012లో ఉన్ముక్త్ చంద్ కెప్టెన్సీలో భారత్ విశ్వవిజేతగా నిలిచింది.
టోర్నీలో ఛాంపియన్ ప్రదర్శన కనబర్చిన అండర్-19 యువ జట్టుకు బీసీసీఐ భారీ నజరానా ప్రకటించింది. కోచ్ రాహుల్ ద్రవిడ్‌కు రూ. 50 లక్షలు, ఒక్కో జట్టు సభ్యుడికి రూ. 30 లక్షలు, ఇక సపోర్టింగ్ స్టాఫ్‌కు రూ. 20 లక్షల చొప్పున నజరానా ప్రకటించింది.