మిథాలీ రాజ్ , స్మృతి మంధాన, షెఫాలీ వర్మ.. భారత క్రికెట్ లో సంచలనాలు సృష్టించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వీళ్ల సరసన చోటు సంపాదించేందుకు సిద్ధమవుతోంది తెలుగుమ్మాయి గొంగడి త్రిష. స్పిన్ మాయాజలం, మెరుపు షాట్ల బ్యాటింగ్ తో ఔరా అనిపించే ఈ కుడిచేతి వాటం బ్యాటర్ తన ఆల్ రౌండ్ షోతో.. తాజాగా అండర్ 19 టీ20 వరల్డ్ కప్ ను భారత్ కు అందించింది. ఈ నేపథ్యంలో
పల్లెటూరి నుంచి మొదలైన ఆమె ప్రయాణం.. ప్రపంచ వేదికపై పరుగుల వరద పారించే వరకు ఎలా సాగిందో తెలుసుకుందాం.
చిన్నప్పటి నుంచే..
ఖమ్మంలోని భద్రాచలం త్రిష స్వస్థలం. ఈమె తండ్రి రామిరెడ్డికి ఆటలంటే ఇష్టం. అందుకే త్రిషకు చిన్నవయసు నుంచే క్రీడల్లో ప్రోత్సాహించారు. మొదట టెన్నిస్, బ్యాడ్మింటన్ ప్రాక్టీస్ చేసింది త్రిష. అనంతరం త్రిషకు క్రికెట్ పై మక్కువ పెరగడంతో.. చిన్నప్పటి నుంచే క్రికెట్ శిక్షణ అందించారు. రెండున్నార ఏళ్లకే ఆమెకు బ్యాట్ అందించారు. ఆమెకు 7ఏళ్లు వచ్చాక సికింద్రాబాద్‌లోని ఓ కోచింగ్ సెంటర్‌లో తన తండ్రి చేర్పించి శిక్షణ అందించారు. క్రికెట్‌తో పాటు చదువును కూడా కొనసాగించింది త్రిష. ఇంట్లోనే ట్యూషన్లు పెట్టించుకొని మరీ పరీక్షలు రాసేది.

రోజుకు 8 గంటలు
ఈ క్రమంలోనే 8 ఏళ్లకే తెలంగాణ జిల్లా స్థాయిలో పాల్గొని ఉమెన్ ఆఫ్ ది సిరీస్ గా నిలిచింది. 2014 నుంచి క్రికెట్ టోర్నీలకు వెళ్లడం ప్రారంభించింది. ఇందుకోసం మొదట ప్లాస్టిక్ బాల్, బ్యాట్‌తో సాధన చేసిన త్రిష.. ఆ తర్వాత టెన్నిస్ బాల్‌తోనూ సాధన చేసింది. రోజుకు 200-300 బంతులను ఎదుర్కొనేది. ఉదయం 4 గంటల పాటు, సాయంత్రం 4 గంటల పాటు చొప్పున రోజుకు ఎనిమిది గంటల పాటు క్రికెట్ ప్రాక్టీస్ చేసేది. ఈ క్రమంలో అండర్ 19, 23తో పాటు సీనియర్ ఛాలెంజ్ మెంట్ టోర్నీలో మంచి ప్రదర్శన చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును దక్కించుకుంది. అలా సెలక్టర్ల దృష్టిలో పడింది.
రెండు ప్రపంచకప్ ల్లోనూ కీలకంగా
4,27,49,40,110,35,44.. ఈ ప్రపంచకప్ లో ప్రతి మ్యాచ్‌లో త్రిష తనదైన ఇన్నింగ్స్ తో ఆకట్టుకుంది. ఇందులో ఓ సెంచరీ ఉండటం విశేషం. స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 59 బంతుల్లో ఏకంగా 110 పరుగులతో నాటౌట్‌గా నిలిచింది. మహిళల అండర్ -19 వరల్డ్ కప్ చరిత్రలోనే తొలి శతకాన్ని నమోదు చేసి, సువర్ణాక్షరాలతో తన పేరును లిఖించుకుంది. బౌలింగ్‌లో కీలక వికెట్లు తీసి సత్తాచాటింది. గతంలో అండర్-19 మహిళల ఆసియా కప్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచింది త్రిష. అలానే రెండేళ్ల క్రితం జరిగిన అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్-2023 కప్ గెలవడంలోనూ కీలక పాత్ర పోషించింది. దిగ్గజ క్రికెటర్లు కూడా ఈమె బౌలింగ్ నైపుణ్యం, బ్యాటింగ్ మెరుపులకు ఫిదా అయిపోయారు.