
హైదరాబాద్: ఐసీసీ అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్లో పాల్గొనే భారత యువ క్రికెటర్ల ఫోన్లు స్విచ్ఛాఫ్ చేయాల్సిందిగా టీమిండియా మాజీ దిగ్గజ క్రికెటర్, కోచ్ రాహుల్ ద్రవిడ్ ఆదేశాలు జారీ చేశాడట. వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా శనివారం (ఫిబ్రవరి 3)న ఐసీసీ అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
న్యూజిలాండ్ వేదికగా జరగనున్న ఈ ఫైనల్లో భారత్-ఆస్ట్రేలియా తలపడనున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆటగాళ్ల ఏకాగ్రత దెబ్బతినకుండా ఉండేందుకు గాను రాహుల్ ద్రవిడ్ ఫైనల్ ముగిసే వరకూ ఫోన్లు స్విచ్ఛాఫ్ చేయాల్సిందిగా ఆటగాళ్లకు ఆదేశాలు జారీ చేశాడు.
ద్రవిడ్ ఇలా ఆటగాళ్లకు ఆదేశాలు జారీ చేయడం ఇదే తొలిసారి కాదంట. బెంగళూరు వేదికగా జనవరి 27, 28 తేదీల్లో వేలం జరిగిన సమయంలో కూడా ఆటగాళ్లకు క్లాస్ తీసుకున్న సంగతి తెలిసిందే. 'ఐపీఎల్ కోసం వేలం ప్రతి ఏడాది నిర్వహిస్తారు. అండర్-19 వరల్డ్ కప్‌లో ఆడే అవకాశం మాత్రం రెండేళ్లకు ఒకసారి మాత్రమే వస్తుంది. ఆటపై దృష్టి పెట్టండి' అని ద్రవిడ్ అన్న సంగతి తెలిసిందే.
కాగా, ఫైనల్స్ కావడంతో ఆటగాళ్లు ఫోన్లు వాడితే వారి ఏకాగ్రత దెబ్బతింటుందని, ఒత్తడికి గురవుతారని ద్రవిడ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 'పాక్‌తో సెమీఫైనల్ అనంతరం మా కుమారుడు శివమ్ మావితో మాట్లాడదామని ప్రయత్నించాను. కానీ, ఫోన్ స్విచ్ఛాఫ్ వచ్చింది. గత ఆదివారం చివరి సారిగా శివమ్‌తో మాట్లాడాను. కీలక మ్యాచ్‌లకు ముందు ఫోన్లు వాడొద్దని ద్రవిడ్ ఆదేశాలు జారీ చేసినట్లు అప్పుడే శివమ్ మాతో చెప్పాడు' అని శివమ్ తండ్రి పంకజ్ మావి తెలిపారు.
ఫైనల్లో భారత్ గెలిస్తే అరుదైన రికార్డును సొంతం చేసుకుంటుంది. ఐసీసీ అండర్-19 వరల్డ్ కప్‌లో ఇప్పటవరకు ఏ జట్టు కూడా నాలుగు సార్లు విశ్వవిజేతగా అవతరించలేదు. అటు భారత్, ఇటు ఆస్ట్రేలియా ఇప్పటివరకు మూడు సార్లు వరల్డ్‌కప్ టైటిల్‌ను కైవసం చేసుకున్నాయి. దీంతో ఎవరు గెలిస్తే వాళ్లు సరికొత్త చరిత్రను సృష్టిస్తారు.
అయితే ఫైనల్లో ఫేవరేట్‌గా టీమిండియా బరిలోకి దిగుతోంది. ఈ టోర్నీలో టీమిండియా ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచుల్లో గెలిచి ఫైనల్లోకి అడుగుపెట్టింది. టోర్నీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ 100 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ పృథ్వి షా (94), ఓపెనర్ మన్‌జోత్ కల్రా (86), శుభ్‌మాన్ గిల్ (63) హాఫ్ సెంచరీలతో రాణించడంతో టీమిండియా 328 పరుగులు చేసింది.
ఆ తర్వాత భారత బౌలర్ల దెబ్బకు ఆస్ట్రేలియా 228 పరుగులకే కుప్పకూలింది. ఆ తర్వాత వరుసగా పపువా న్యూ గినియా, జింబాబ్వే, బంగ్లాదేశ్, పాక్‌లపై భారత్ విజయం సాధించింది. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం శనివారం ఉదయం 6.30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్ 1లో మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం కానుంది.
మ్యాచ్ డిటేల్స్:
ఇండియా Vs ఆస్ట్రేలియా
ICC Under-19 Cricket World Cup final (ICC U19CWC final)
ఉదయం 6.30 నుంచి స్టార్ స్పోర్ట్స్ 1లో ప్రత్యక్ష ప్రసారం
లైవ్ స్ట్రీమ్: Hotstar.com
జట్ల వివరాలు:
ఇండియా: పృథ్వీ షా (Capt), శుభమాన్ గిల్, ఆర్యన్ జుయాల్, అభిషేక్ శర్మ, అర్షదీప్ సింగ్, హార్విక్ దేశాయ్, మన్‌జ్యోత్ కార్లా, కమలేష్ నాగర్‌కోటి, పంకజ్ యాదవ్, రేయాన్ పరాగ్, ఇషాన్ పోరేల్, హిమాంశు రాణా, అనుకుల్ రాయ్, శివమ్ మావి, శివ సింగ్
ఆస్ట్రేలియా: జాసన్ సాన్యా (కెప్టెన్), విల్ సదర్లాండ్, జేవియర్ బార్ట్లెట్, మాక్స్ బ్రయంట్, జాక్ ఎడ్వర్డ్స్, జాక్ ఎవాన్స్, జారోడ్ ఫ్రీమాన్, ర్యాన్ హాడ్లీ, బాక్టర్ హాల్ట్, నాథన్ మెక్స్వీనీ, జోనాథన్ మెర్లో, లాయిడ్ పోప్, జాసన్ రాల్స్టన్, పరాం ఉప్పల్, ఆస్టిన్ వా