
హైదరాబాద్: మంగళవారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో భారత యువ జట్టు 74 పరుగుల తేడాతో విజయం సాధించడంతో దక్షిణాఫ్రికాలో జరుగుతున్న అండర్ 19 ప్రపంచకప్‌లో సెమీస్‌కు చేరిన తొలి జట్టుగా భారత యువ జట్టు అరుదైన ఘనత సాధించింది.
ఈ టోర్నీలో ఢిపెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన భారత యువ జట్టు ఓటమనేది ఎరుగుకుండా సెమీస్‌కు చేరుకుంది. లీగ్ దశలో శ్రీలంక, జపాన్, న్యూజిలాండ్ జట్లపై గెలిచిన భారత యువ జట్టు... క్వార్టర్ ఫైనల్లో ఆస్ట్రేలియాపై విజయం సాధించిన సెమీస్‌కు చేరుకుంది.
మంగళవారం జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 233 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య చేధనకు దిగిన ఆస్ట్రేలియా జట్టుని 159 పరుగులకే కట్టడి చేసింది. ఫలితంగా 74 పరుగుల తేడాతో విజయం సాధించింది.
భారత విజయంతో బౌలర్లు కీలకపాత్ర పోషించారు. కార్తీక్ త్యాగి ఆరంభంలోనే ఆస్ట్రేలియాకు కంగారు పెట్టగా.. ఆకాశ్ సింగ్ (3/30) కీలక సమయంలో వికెట్లు తీసి ఆసీస్‌ను ఒత్తిడిలోకి నెట్టాడు. ఈ ఓటమితో ఆస్ట్రేలియా టోర్నీ నుండి భారంగా నిష్క్రమించింది. ఈ మ్యాచ్‌లో నమోదైన రికార్డులివే:
1 - ఐసీసీ అండర్ 19 ప్రపంచకప్ చరిత్రలో మొట్టమొదటి కాంకషన్‌గా ఆస్ట్రేలియా ఆటగాడు లియామ్ స్కాట్ నిలిచాడు. ఈ మ్యాచ్‌లో అతను కోరీ కెల్లీ స్థానాన్ని భర్తీ చేశాడు. భారత ఇన్నింగ్స్ చివరి ఓవర్లో అతడు కాంకషన్ కింద మైదానంలో అడుగుపెట్టాడు.
4 - ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌లో మొదటి మూడు వికెట్లు తీయడానికి టీమిండియాకు కేవలం నాలుగు బంతులు మాత్రమే అవసరమయ్యాయి. అండర్ 19 ప్రపంచకప్‌లో 3వ వికెట్ తీసేందుకు టీమిండియా విసిరిన అతి తక్కువ బంతులు ఇవే కావడం విశేషం. అండర్ 19 ప్రపంచకప్‌లో ఇన్నింగ్ ఆరంభంలోనే తొలి మూడు వికెట్లు కోల్పోయిన మరో జట్టు శ్రీలంక. 2008 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో మొదటి ఓవర్ ముగిసే సమయానికి వారు 5/3 పరుగులు చేశారు. పాక్ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ మొహమ్మద్ అమీర్ మూడు వికెట్లు పడగొట్టాడు.
5-2 - ఆస్ట్రేలియా టీమిండియాకు ఇది వరుసగా ఐదో విజయం. అండర్ 19 ప్రపంచకప్‌లో టీమిండియాతో ఆస్ట్రేలియా తలపడిన మొదటి రెండు సార్లు(1988, 1998) విజయం సాధించింది. ఆ తర్వాత ప్రపంచకప్ చరిత్రలో ఐదు సార్లు ఆస్ట్రేలియాను ఓడించిన మొదటి జట్టుగా భారత్ నిలిచింది.
9 - తాజా విజయంతో అండర్ 19 ప్రపంచకప్ చరిత్రలో టీమిండియా 9వ సారి సెమీస్‌కు అర్హత సాధించింది. ఏ జట్టుకైనా ఇదే అత్యధికం కావడం విశేషం. ఆస్ట్రేలియా కూడా తొమ్మిది సార్లు సెమీస్‌కు అర్హత సాధించింది. పాకిస్తాన్ సైతం ఎనిమిది సార్లు సెమీస్‌లో చోటు దక్కించుకుంది. ప్రస్తుతం జరుగుతున్న ఎడిషన్‌లో ఆ జట్టు ఇంకా క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ ఆడలేదు.
10 - తాజా విజయంతో యువ భారత్ పలు రికార్డులను ఖాతాలో వేసుకుంది. ఆసీస్‌పై సాధించిన విజయం అండర్-19 ప్రపంచకప్‌లో భారత్‌కు వరుసగా పదో విజయం. దీంతో ప్రపంచకప్‌లో వరుసగా పది విజయాలు అందుకున్న ఏకైక జట్టుగా వరల్డ్ రికార్డును ఖాతాలో వేసుకుంది. 2018-2020 మధ్యలో జరిగిన రెండు ప్రపంచకప్‌లలో భారత్ వరుసగా పది విజయాలు సాధించింది. గతంలో ఈ రికార్డు ఆసీస్ పేరిట ఉండేది. 2002-04 మధ్యలో ఆసీస్ వరుసగా తొమ్మిది విజయాలు సాధించింది.
200 - ఈ విజయంతో టీమిండియా యూత్ క్రికెట్లో 200 మార్కును అందుకుంది. దీంతో ఈ మైలురాయిని అందుకున్న తొలి జట్టుగా భారత్ రికార్డుల్లోకెక్కింది. మొత్తంగా 261 మ్యాచ్‌లాడిన భారత్.. 200 విజయాలు, 56 ఓటములు నమోదు చేసింది. రెండు టై మ్యాచ్‌లు ఉండగా.. మరో మూడింట్లో ఫలితం రాలేదు. మరోవైపు భారత గెలుపోటముల నిష్పత్తి బాగానే ఉంది.