మరోసారి ఐసీసీ అండర్ 19 టీ20 ప్రపంచ కప్ విజేతగా భారత్ అవతరించింది. తెలుగమ్మాయి గొంగడి త్రిష (44) తన ఆల్ రౌండ్ ప్రదర్శనతో ఈ విజయంలో కీలక పాత్ర పోషించింది. ఈ విజయంతో వరుసగా రెండో సారి అండర్ 19 టీ20 ప్రపంచ కప్ టైటిల్ ను ఖాతాలో వేసుకుంది భారత్.
83 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. అవలీలగా లక్ష్యాన్ని ఛేదించింది. గొంగడి త్రిష (33 బంతుల్లో 8 ఫోర్ల సాయంతో 44) అదిరే ప్రదర్శన చేసింది. మరో ఓపెనర్ కమలిని (8) నిరాశపరిచింది. కౌలా రేనెకె ఆమె వికెట్ తీసింది. అనంతరం వన్ డౌన్ బ్యాటర్ గా వచ్చిన సనికా చల్కే(26)తో దూకుడుగా ఆడుతూ గొంగడి త్రిష కలిసి స్కోరు బోర్డును పరుగుపెట్టించింది.

ఈ తుది పోరులో మొదట టాస్ నెగ్గి బ్యాటింగ్ కు దిగిన దక్షిణాఫ్రికాను భారత బౌలర్లు బెంబేలెత్తించారు. దీంతో 20 ఓవర్లలో కేవలం 82 పరుగులకే కుప్పకూలింది సౌతాఫ్రికా. ఆ జట్టులో వాన్ వూరస్ట్ (18 బంతుల్లో 3 ఫోర్ల సాయంతో 23) చేసిన పరుగులే టాప్ స్కోర్. జెమ్మా బోథా (16), డైరా రమ్లాకన్ (3), ఫే కౌలింగ్ (15), కౌలా రేనెకె (7), కరాబో మెసో (10) నిని (2*) పరుగులు చేశారు.
భారత బౌలర్లలో తెలుగమ్మాయి గొంగడి త్రిష మరో తన స్పిన్ మాయాజాలంతో అదరగొట్టింది. ప్రత్యర్ధి బ్యాటర్లను బోల్తా కొట్టించింది. తన నాలుగు ఓవర్ల కోటాలో కేవలం 15 పరుగులే ఇచ్చి 3 వికెట్లు తీసింది. వైష్టవి శర్మ 2, ఆయుషి శుక్లా 2, పరుణిక 2 తలో రెండు వికెట్లు తీశారు. షబ్నమ్ ఒక వికెట్ దక్కించుకుంది.