అండర్-19 మహిళల టీ20 ప్రపంచ కప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ భారత జట్టు జైత్రయాత్రను కొనసాగిస్తోంది.
ఇప్పటికే వరుసగా మూడు మ్యాచుల్లో విజయం సాధించిన మన అమ్మాయిలు.. తాజాగా సూపర్ సిక్స్ గ్రూప్-1లో జరిగిన మ్యాచ్ లోనూ గెలుపొందారు. ఈ పోరులో బంగ్లాదేశ్‌పై 8 వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించారు. తద్వారా సెమీఫైనల్ కు అర్హత సాధించారు.
మొదట బ్యాటింగ్ కు దిగిన బంగ్లా దేశ్.. భారత బౌలర్ల దెబ్బకు 20 ఓవర్లలో 64/8కే కుప్పకూలింది. బంగ్లా జట్టులో సుమైయా అక్తేర్ (21*) టాప్ స్కోరర్ గా నిలిచింది. జన్నాటుల్ మౌవా (14) నామమాత్రపు పరుగులు చేసింది. అశిమా (7), నిశిత (6), సుమైయా అక్తర్ (5), సాదియా ఇస్లామ్ (5), ఎవా (2), ఫహోమిదా చోయా (2) పరుగులు చేశారు. భారత బౌలర్లలో వైష్ణవి శర్మ 3 వికెట్లు పడగొట్టింది. జోషిత, షబ్నామ్, త్రిష తలో వికెట్ దక్కించుకున్నారు.

అనంతరం స్వల్ప లక్ష్యాన్ని భారత అమ్మాయిలు 7.1 ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయి ఛేదించారు. తెలుగమ్మాయి గొంగడి త్రిష 31 బంతుల్లో 8 ఫోర్ల సాయంతో 40 పరుగులు చేసి అదరగొట్టింది. కానీ భారత్ విజయానికి చేరువవ్వగానే త్రిష వెనుదిరిగింది. అనంతరం సానికా చాల్కే (11*) పరుగులు చేయగా.. నిక్కీ ప్రసాద్ (5*) విన్నింగ్ షాట్ తో ఆకట్టుకుంది. ఆ తర్వాత కమలిని (3) పరుగులకే ఔట్ అయింది. ఈ సూపర్ సిక్స్ లో భారత జట్టు తన నెక్ట్స్ మ్యాచ్‌ను జనవరి 28న స్కాట్లాండ్‌తో పోటీ పడనుంది.