
సమఉజ్జీలుగా దాయాదులు:
గ్రూప్ దశలో మూడు మ్యాచ్‌లు నెగ్గిన భారత్.. క్వార్టర్స్‌లో పటిష్ట ఆస్ట్రేలియాను చిత్తుచేసి సెమీఫైనల్‌కు దూసుకొచ్చింది. ఇక లీగ్ దశలో రెండు మ్యాచ్‌లు నెగ్గి మరో మ్యాచ్ రద్దు కావడంతో క్వార్టర్స్ చేరిన పాక్.. ఆక్కడ ఆఫ్ఘానిస్థాన్‌ను మట్టికరిపించింది. తాజా టోర్నీలో ప్రదర్శనను బట్టి చూస్తే మాత్రం ఇరు జట్లు సమఉజ్జీలుగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో విజేతను అంచనా వేయడం అంత సులువు కాదు. బ్యాటింగ్, బౌలింగ్‌లలో కూడా దాయాదులు పటిష్టంగానే ఉన్నాయి.

యశస్విపైనే భారం:
బ్యాటింగ్‌లో భారత్ బలంగా కనిపిస్తున్నా.. ఓపెనర్ యశస్వి జైస్వాల్‌పైనే ఎక్కువ ఆధార పడుతున్నదనేది వాస్తవం. ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో అతడు మూడు హాఫ్ సెంచరీలు బాదాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో మంచి అనుభవం ఉన్న యశస్వి మరోసారి యాంకర్ రోల్ పోషిస్తే.. యువ భారత్ భారీ స్కోరు చేయడం ఖాయం. దివ్యాన్ష్ సక్సేనా, ప్రియం గార్గ్, ధృవ్ జురేల్, సిద్ధేశ్ వీర్ సమిష్టిగా రాణించాల్సి ఉంది. హైదరాబాదీ ఆటగాడు ఠాకూర్ తిలక్ వర్మ కూడా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడితే అతనికి మంచి కెరీర్ ఉండనుంది.

ఫామ్‌లో త్యాగీ, బిష్ణోయ్:
భారత బౌలింగ్ మాత్రం అద్భుతంగా రాణిస్తుండటం చెప్పుకోదగ్గ అంశం. బౌలింగ్‌లో యువ పేసర్ కార్తీక్ త్యాగీ 140 కిలోమీటర్లకు తగ్గని వేగంతో దుమ్మురేపుతున్నాడు. రవి బిష్ణోయ్, అథర్వ అంకొలేకర్ ప్రత్యర్థులను తిప్పేస్తున్నారు. ఆకాశ్ సింగ్, సుశాంత్ మిశ్రా కూడా మంచి ఫామ్‌లో ఉన్నారు. పోచెఫ్‌స్ట్రూమ్ పిచ్‌పై రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేస్తూ బిష్ణోయ్ బంతులను ఎదుర్కోవడం కష్టమే. లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ 11 వికెట్లు పడగొట్టగా.. త్యాగి 9 వికెట్లు తీసాడు.

బౌలింగ్‌నే నమ్ముకున్న పాక్:
పాకిస్తాన్ బ్యాటింగ్ కంటే బౌలింగ్‌పైనే ఎక్కువగా ఆధారపడుతోంది. మొహమ్మద్ హారిస్ ఒక్కడే మొత్తం స్కోరు వంద పరుగులు దాటగా (110) ఒక మ్యాచ్ రద్దు కారణంగా ఎక్కువ మంది బ్యాట్స్‌మెన్‌కు పెద్దగా ఆడే అవకాశం రాలేదు. ఖాసిమ్ అక్రమ్, హైదర్ అలీ, కెప్టెన్ రొహైల్ నజీర్, ఇర్ఫాన్ ఖాన్, ఫహద్ మునీర్ ప్రధాన బ్యాట్స్‌మెన్. గత మ్యాచ్‌లో అరంగేట్రం చేసిన మొహమ్మద్ హురైరా తన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. పేసర్లు అబ్బాస్ అఫ్రీది, మహమ్మద్ అమీర్ ఖాన్, తాహిర్ హుస్సేన్‌లో భారత బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది.

పిచ్, వాతావరణం:
పోచెఫ్‌స్ట్రూమ్‌లో వాతావరణం ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పడం చాలా కష్టం. మంగళవారం వర్షం పడే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ సెమి ఫైనల్ మ్యాచ్ రైద్దెతే.. గ్రూప్ స్టేజ్‌లో ఎక్కువ విజయాలు సాధించిన భారత్ ఫైనల్‌కు చేరుతుంది. ఆరంభంలో పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలించినా.. బంతి పాతబడ్డాక స్పిన్నర్లు ప్రభావం చూపగలరు.

తుది జట్లు (అంచనా):
భారత్: ప్రియం గార్గ్ (కెప్టెన్), యశస్వి, దివ్యాన్ష్, తిలక్ వర్మ, ధృవ్ జురేల్, సిద్ధేశ్, అథర్వ, రవి, సుశాంత్, కార్తీక్, ఆకాశ్.
పాకిస్థాన్: రోహైల్ నజీర్ (కెప్టెన్), హైదర్ అలీ, హురేరా, ఫహద్, ఖాసిం, హరీస్, ఇర్ఫాన్ ఖాన్, అబ్బాస్ అఫ్రీది, తాహిర్, అమీర్ అలీ, అమీర్ ఖాన్.


Click it and Unblock the Notifications












