
హైదరాబాద్: న్యూజిలాండ్ వేదికగా జరుగుతోన్న అండర్-19 వరల్డ్ కప్‌లో పాకిస్థాన్‌తో మంగళవారం జరిగిన రెండో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన శుభమాన్ గిల్‌కి ఆట పట్ల అంకితభావం ఎక్కువని అతని తండ్రి లిఖ్విందర్ సింగ్ పేర్కొన్నాడు.
క్రైస్ట్ చర్చ్ హాగ్లీ ఓవల్ మైదానంలో జరిగిన రెండో సెమీ ఫైనల్లో శుభమాన్ గిల్ 94 బంతుల్లో 7 ఫోర్ల సాయంతో 102 పరుగులతో నాటౌట్‌గా రాణించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 272 పరుగులు చేసింది. అనంతరం 273 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ భారత బౌలర్ల దెబ్బకు 29.3 ఓవర్లలో 69 పరుగులకే ఆలౌటైంది.
దీంతో పాకిస్థాన్‌పై టీమిండియా 203 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. అండర్-19 వరల్డ్ కప్ టోర్నీలో పాకిస్థాన్‌కు ఇదే అతిపెద్ద ఓటమి. భారత జట్టు విజయంలో శుభమాన్ గిల్ కీలక పాత్ర పోషించడంపై లిఖ్విందర్ సింగ్ మాట్లాడుతూ 'గిల్ బ్యాటింగ్ ప్రదర్శనతో తాము చాలా ఆనందించామని.. పాకిస్థాన్ జట్టుపై అజేయ సెంచరీ చేయడం మరింత సంతృప్తినిచ్చింది' అని అన్నాడు.
'శుభమాన్ గిల్‌కి ఆట పట్ల అంకితభావం ఎక్కువ. ప్రపంచకప్‌లో నా కొడుకు ప్రదర్శన చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. సెమీ ఫైనల్లో సెంచరీ చేయడం, పాకిస్థాన్ జట్టుని భారత్ ఓడించడంతో అది మరింత రెట్టింపు అయ్యింది. చిన్నప్పటి నుంచి బొమ్మల కంటే బ్యాట్, బంతితోనే ఎక్కువ సమయం గిల్ గడిపేవాడు' అని అన్నాడు.
టరాత్రి పడుకునే ముందు కూడా క్రికెట్ ఆడుతుండేవాడు. అతని కలలు నెరవేర్చుకునేందుకు మా ఫ్యామిలీ పరంగా పూర్తి మద్దతిస్తాం. ఇప్పటికే గత దశాబ్దకాలంగా ఎన్నో ఫ్యామిలీ ఫంక్షన్లకి మేము దూరమయ్యాం. ఇకపై కూడా అతని కోసం త్యాగాలు చేసేందుకు మేము సిద్ధం' అని లిఖ్విందర్ చెప్పుకొచ్చాడు.
కాగా, ఐసీసీ అండర్-19 వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా శనివారం (ఫిబ్రవరి 3)న జరగనున్న టోర్నీ ఫైనల్లో ఆస్ట్రేలియాతో భారత్ తలపడనుంది. ఇదిలా ఉంటే బెంగళూరు వేదికగా గత శని, ఆదివారం జరిగిన ఐపీఎల్ 2018 ఆటగాళ్ల వేలంలో రూ. 20లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన శుభమాన్ గిల్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్ రూ. 1.8 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది.