ఐసీసీ అండర్-19 మహిళల టీ20 ప్రపంచ కప్ 2025 ఆసక్తికరంగా సాగుతోంది. తాజాగా ఆఖరి సూపర్ సిక్స్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టుకు లంక షాకిచ్చింది. ఈ మెగా టోర్నీలో విజయాలతో దూసుకెళ్తోన్న ఆసీస్‌ను శ్రీలంక ఓడించింది. 12 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే ఈ విజయం సాధించినప్పటికీ లంక జట్టుకు సెమీస్ అదృష్టం కలుగలేదు. మరోవైపు ఓటమినీ అందుకున్నప్పటికీ ఇప్పటికే ఆసీస్ సెమీస్ బెర్త్ ను ఖరారు చేసేసుకుంది.
మ్యాచ్ విషయానికొస్తే టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన లంక నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 99 పరుగులు చేసింది. లంక ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు సంజన కవిండి (19), సుముదు నిసంసల (18) టాప్ స్కోరర్. ఆసీస్ బౌలర్లలో లిల్లీ బాస్సింగ్‌వైత్ 3 వికెట్లు తీయగా.. హస్రత్ గిల్, టెగాన్ విలియమ్సన్ తలో రెండు వికెట్లు పడగొట్టారు.

అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనలో లంక బౌలర్లు చేలరేగారు. దీంతో ఆస్ట్రేలియా నిర్ణతీ 20 ఓవర్లో 8 వికెట్ల నష్టానికి 87 పరుగులే చేసింది. ఆసీస్ ఇన్నింగ్స్‌లో బ్రే (27) టాప్ స్కోరర్‌గా నిలిచింది. మిగతా వారు నామమాత్రపు పరుగులు చేయడానికి కూడా ఇబ్బంది పడ్డారు.
లంకకు తప్పని నిరాశ - సెమీ ఫైనల్ ఎప్పుడంటే
గ్రూప్ స్టేజ్ లో లంక జట్టు.. మలేసియా, విండీస్ జట్లపై విజయాలను అందుకున్నప్పటికీ భారత్ చేతిలో దారుణంగా ఓడిపోయింది. దీంతో సెమీస్ అవకాశాలను క్లిష్టంగా మారాయి. ఆ తర్వాత కూడా సూపర్-6లో జరిగిన మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించడంతో రద్దైంది. ఫలితంగా లంక సెమీస్ ఆశలు గల్లంతయ్యాయి. దీంతో గ్రూప్-1 నుంచి భారత్, ఆస్ట్రేలియా సెమీస్ కు అర్హత సాధించాయి. గ్రూప్-2 నుంచి సౌతాఫ్రికా, ఇంగ్లాండ్ సెమీకు ఎంటర్ అయ్యాయి. జనవరి 31 తొలి సెమీ ఫైనల్ లో ఆస్ట్రేలియా - సౌతాఫ్రికా తలపడనున్నాయి. రెండో సమీ ఫైనల్ లో భారత్ - ఇంగ్లాండ్ పోటీ పడనున్నాయి.