
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టెస్ట్ ర్యాంకింగ్స్‌లో ఇంగ్లండ్ సీనియర్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ జోరు కొనసాగించాడు. విండీస్‌తో జరిగిన మూడో టెస్టులో పది వికెట్లు తీయడంతో బ్రాడ్ ఐసీసీ టెస్ట్ బౌలర్ ర్యాంకిగ్స్‌లో మూడో స్థానంలో నిలిచాడు. మూడో టెస్టును 269 పరుగుల తేడాతో గెలవడంలో బ్రాడ్ కీలకపాత్ర పోషించాడు. మొదటి ఇన్నింగ్స్‌లో ఆరు, రెండో ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు పడగొట్టాడు. దీంతో ఇంగ్లండ్ మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1తో గెలిచి విస్డెన్ ట్రోఫీని కైవసం చేసుకుంది.
మాంచెస్టర్ టెస్ట్ ప్రారంభానికి ముందు స్టువర్ట్ బ్రాడ్ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో పదో స్థానంలో ఉన్నాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత ఏడు స్థానాలు ఎగబాకి మూడో స్థానంలో నిలిచాడు. బ్రాడ్ టెస్ట్ క్రికెట్లో 500 వికెట్లు నమోదు చేసిన ఏడో బౌలర్‌గా అవతరించాడు. విండీస్ బ్యాట్స్‌మన్ క్రెయిగ్ బ్రాత్‌వైట్‌ను ఔట్ చేయడం ద్వారా 500వ వికెట్‌ను స్టువర్ట్ బ్రాడ్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇంగ్లండ్ తరఫున అత్యధిక వికెట్లు సాధించిన రెండవ బౌలర్‌గా నిలిచాడు. బ్రాడ్ కంటే ముందు జేమ్స్ అండర్సన్ 500 వికెట్ల క్లబ్‌లో ఉన్నాడు. మొదటి ఇన్నింగ్స్‌లో 45 బంతుల్లో 62 పరుగులు చేసి ఆల్ రౌండర్స్ ర్యాంకింగ్‌లో 11వ స్థానానికి చేరుకున్నాడు.
500 వికెట్ల క్లబ్‌లో చేరిన స్టువర్ట్ బ్రాడ్.. ప్రపంచ క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన పేస్ బౌలర్లలో ఒకడిగా నిలిచాడు. 34 ఏళ్ల వయస్సులోనూ గంటకు సుమారు 90 మైళ్ల వేగంతో బంతులు విసురుతూ బ్యాట్స్‌మెన్‌ను వణికిస్తున్నాడు. ప్రస్తుతం బ్రాడ్ ఇంగ్లండ్ తరఫున టెస్టుల్లో కీలక బౌలర్‌గా కొనసాగుతున్నాడు.
ఐసీసీ టెస్ట్ బౌలర్ ర్యాంకింగ్స్‌లో ఆసీస్ స్టార్ పేసర్ ప్యాట్ కమిన్స్ అగ్రస్థానంలో ఉన్నాడు. కమిన్స్ ఖాతాలో 904 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. నీల్ వాగ్నర్ (843), స్టువర్ట్ బ్రాడ్ (823), టీమ్ సౌథీ (812), జాసన్ హోల్డర్ (810) వరుసగా టాప్-5లో ఉన్నారు. కాగిసో రబాడ (802), మిచెల్ స్టార్క్ (797), జస్ప్రీత్ బుమ్రా (779), ట్రెంట్ బౌల్ట్ (770), జోష్ హేజిల్‌వుడ్ (769) టాప్-10లో ఉన్నారు.
విరాట్ కోహ్లీ (871 పాయింట్లు), రోహిత్ శర్మ (855) ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో తొలి రెండు స్థానాలను నిలబెట్టుకున్నారు. బాబర్ ఆజమ్ (829) మూడో స్థానంలో ఉన్నాడు. బౌలర్ల జాబితాలో జస్‌ప్రీత్ బుమ్రా (719) రెండో స్థానంలో మార్పు లేదు. కివీస్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ (722) నెంబర్‌వన్ బౌలర్‌గా ఉన్నాడు. ఆల్‌రౌండర్ల జాబితాలో బెన్ స్టోక్స్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.