అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తాజాగా టెస్టు ర్యాంకింగ్స్‌ను వెల్లడించింది. భారత్ వర్సెస్ న్యూజిలాండ్, పాకిస్థాన్ వర్సెస్ ఇంగ్లండ్ టెస్టు మ్యాచ్‌లు ముగియడంతో ఐసీసీ బుధవారం టెస్టు ర్యాంకింగ్స్ ప్రకటించింది. టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ ఏకంగా మూడు స్థానాలు ఎగబాకి ఆరో స్థానంలో నిలిచాడు.
2022 డిసెంబర్‌లో రోడ్డు ప్రమాదానికి గురైన పంత్ ఇటీవల బంగ్లాదేశ్ సిరీస్‌తో తిరిగి టెస్టుల్లోకి రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే బెంగళూరు వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో పంత్ 20, 99 పరుగులతో సత్తాచాటాడు. రెండో ఇన్నింగ్స్‌లో తృటిలో సెంచరీ కోల్పోయనప్పటికీ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఈ క్రమంలో రేటింగ్ పాయింట్లు (745) మెరుగుపర్చుకుని ఆరో ర్యాంక్‌కు చేరాడు.

టాప్-10లో పంత్‌తో పాటు యశస్వీ జైస్వాల్, విరాట్ కోహ్లి ఉన్నారు. 780 పాయింట్లతో జైస్వాల్ నాలుగో స్థానాన్ని కాపాడుకోగా, కోహ్లి ఒక స్థానాన్ని కోల్పోయి 720 పాయింట్లతో ఎనిమిదో ర్యాంక్‌లో ఉన్నాడు. కివీస్‌తో తొలి టెస్టులో జైస్వాల్ 13, 35 పరుగులు చేయగా, కోహ్లి డకౌట్, 70 రన్స్ చేశాడు. కాగా, టాప్-3లో జో రూట్ (ఇంగ్లండ్), కేన్ విలియమ్సన్ (న్యూజిలాండ్), హ్యారీ బ్రూక్ (ఇంగ్లండ్) ఉన్నారు.
శ్రీలంక యువ సంచలనం కామిందు మెండిస్ టాప్-10లో చోటు దక్కించుకున్నాడు. న్యూజిలాండ్ యువ ప్లేయర్ రచిన్ రవీంద్ర 36 స్థానాలు ఎగబాకి 18 ర్యాంక్‌లో నిలిచాడు. బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో పెద్దగా మార్పులు చోటు చేసుకోలేదు. జస్‌ప్రీత్ బుమ్రా, రవిచంద్రన్ అశ్విన్, హేజిల్‌వుడ్ (ఆస్ట్రేలియా) టాప్-3లో కొనసాగుతున్నారు. కివీస్ బౌలర్ మ్యాట్ హెన్రీ రెండు ర్యాంక్‌లు ఎగబాకి 9వ స్థానంలో నిలిచాడు. ఆల్‌రౌండర్ జాబితాలో రవీంద్ర జడేజా, అశ్విన్ టాప్-2లో ఉన్నారు.