|
టాప్ 5లోకి బుమ్రా
శ్రీలంకతో టెస్టు సిరీస్‌లో రాణించిన జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో 6 స్థానాలు ఎగబాకి నాల్గో స్థానానికి చేరుకున్నాడు. బుమ్రా ఖాతాలో 830 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. బుమ్రా ఈ క్రమంలో షాహీన్ అఫ్రిదీ, కైల్ జేమీసన్, టీమ్ సౌథీ, జేమ్స్ అండర్సన్, నీల్ వాగ్నర్, జోష్ హేజిల్‌వుడ్‌లను అధిగమించాడు. శ్రీలంకతో తొలి టెస్టులో 3 వికెట్లు తీసిన బుమ్రా, రెండో టెస్టు ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 5, రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్లతో కలిపి మొత్తం 8 వికెట్లను ఖాతాలో వేసుకున్నాడు. మరో టీమిండియా పేసర్ మహ్మద్ షమీ ఒక స్థానం ఎగబాకి 17వ ర్యాంకుకు చేరుకున్నాడు.

దిగజారిన విరాట్ కోహ్లీ ర్యాంకు
కొంత కాలంగా సరైన ఫాంలో లేని విరాట్ కోహ్లీ శ్రీలంకతో సిరీస్‌లో కూడా విఫలమయ్యాడు. దీంతో ఇంతకు ముందు బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో ఐదో స్థానంలో ఉన్న కోహ్లీ.. నాలుగు స్థానాలు దిగజారి 9వ ర్యాంకుకు పడిపోయాడు. కోహ్లీ ఖాతాలో 742 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. ఇక రోహిత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్, రిషబ్ పంత్ ర్యాంకుల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు.
బ్యాటింగ్ ర్యాకింగ్స్లో రోహిత్ శర్మ ఆరో స్థానంలో, రిషబ్ పంత్ పదో స్థానంలో, బౌలింగ్, ఆల్‌రౌండర్ ర్యాంకింగ్స్‌లో అశ్విన్ 2, 3 స్థానాల్లో కొనసాగుతున్నారు. ఇక రవీంద్ర జడేజా ఆల్‌రౌండర్ విభాగంలో మొదటి స్థానం నుంచి రెండో స్థానానికి పడిపోయాడు. ఇక శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌లో రాణించిన శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో 22 స్థానాలు ఎగబాకి 22వ ర్యాంకుకు చేరుకున్నాడు.

ఎగబాకిన శ్రీలంక ప్లేయర్లు
భారత్‌తో రెండో టెస్ట్ మ్యాచ్‌లో సెంచరీ కొట్టిన శ్రీలంక కెప్టెన్ దిముత్ కరుణరత్నే ఐదో స్థానానికి ఎగబాకాడు. శ్రీలంక బౌలర్లు లసిత్ ఎంబుల్దేనియా, ప్రవీణ్ జయవిక్రమ ఐదు స్థానాల చొప్పున ఎగబాకి వరుసగా 32, 45వ ర్యాంకులకు చేరారు. పాట్ కమిన్స్, రవిచంద్రన్ అశ్విన్, కగిసో రబడా తొలి మూడు స్థానాలను నిలబెట్టుకున్నారు.
వెస్టిండీస్‌తో జరిగిన టెస్టు మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీతో చెలరేగిన ఇంగ్లండ్ బ్యాటర్ జాక్ క్రాలీ 13 స్థానాలు ఎగబాకి 49వ స్థానానికి చేరుకున్నాడు. ఆల్‌రౌండర్ విభాగంలో బంగ్లాదేశ్ ఆటగాడు షకీబ్ అల్ హసన్, ఇంగ్లండ్ ఆటగాడు బెన్ స్టోక్స్ నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నారు.