
దుబాయ్: భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ 2019 ఏడాదిని నెం.1 ర్యాంక్‌తో ముగించిన విషయం తెలిసిందే. గతేడాది ఫామ్‌ను కోహ్లీ 2020లో కూడా కొనసాగిస్తున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) మంగళవారం విడుదల చేసిన టెస్టు ర్యాంకింగ్స్‌లో 928 పాయింట్లతో విరాట్ కోహ్లీ అగ్ర స్థానంలో నిలిచాడు. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ 911 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. గత ఏడాది నెం.1 స్థానం కోసం పోటీనిచ్చిన స్మిత్ 17 పాయింట్ల దూరంలో నిలిచాడు.
ఐసీసీ మంగళవారం విడుదల చేసిన టెస్ట్ ర్యాంకింగ్స్ బ్యాట్స్‌మన్ జాబితాలో తొలి నాలుగు స్థానాల్లో ఎటువంటి మార్పులూ చోటుచేసుకోలేదు. ఆస్ట్రేలియాకు చెందిన టెస్టు సంచలనం మార్కస్ లబుషేన్ 827 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాడు. న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ 814 పాయింట్లతో నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు.
పాకిస్తాన్ స్టార్ ఆటగాడు బాబర్ అజామ్ ఐదో స్థానంకు దూసుకొచ్చాడు. పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లలో సత్తాచాటుతున్న బాబర్ టెస్ట్ ఫార్మాట్‌లో కూడా నిరూపించుకున్నాడు. రావల్పిండిలో జరిగిన తొలి టెస్టులో బంగ్లాపై 143 పరుగులు చేసి పాక్ జట్టుకు ఇన్నింగ్స్ విజయాన్ని అందించాడు. దీంతో టెస్టు ర్యాంకింగ్స్‌లో బాబర్ రెండు స్థానాలు మెరుగుపరుచుకుని ఐదో స్థానంలో నిలిచాడు. బాబర్ ఖాతాలో ప్రస్తుతం 800 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి.
భారత ఆటగాళ్లు టాప్-10లో ముగ్గురు ఉన్నారు. చతేశ్వర్ పుజారా (791) ఏడో ర్యాంక్‌కు దిగజారగా.. అజింక్య రహానె (759) 9వ స్థానంలో ఉన్నాడు. డేవిడ్ వార్నర్ (793) ఏడవ స్థానంలో కొనసాగుతున్నాడు. వార్నర్, పుజారా ఒక్కో స్థానం పడిపోయారు. ఇంగ్లాండ్ కెప్టెన్ జో (764) రూట్, బెన్ స్టోక్స్ (718) వరుసగా ఎనిమిది, పదవ స్థానంలో ఉన్నారు. పాకిస్తాన్ మరియు బంగ్లాదేశ్ టెస్ట్ ముగిసిన తరువాత ఈ ర్యాంకింగ్స్ విడుదల అయ్యాయి. న్యూజిలాండ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను భారత్ 3-0తో ఓడిపోయిన విషయం తెలిసిందే. ఇక ఫిబ్రవరి 21 నుంచి ప్రారంభమయ్యే రెండు టెస్టుల్లో కివీస్‌తో భారత్ తలపడుతుంది.