
అంటిగ్వా: వెస్టిండీస్ వేదికగా జరిగిన మహిళల టీ20 ప్రపంచకప్-2018 విజేతగా ఆస్ట్రేలియా నిలిచింది. మరోసారి ఆస్ట్రేలియా మహిళల జట్టు అవతరించింది. ఇంగ్లాండ్‌తో జరిగిన ఫైనల్ పోరులో ఆసీస్ ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించి నాలుగో టీ20 ప్రపంచకప్ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకుంది. కరేబియన్ దీవి ఆంటిగ్వాలో జరిగిన ఫైనల్ పోరులో విజయం ఆసీస్‌ను వరించింది. చివరి అంకంలో ఇంగ్లాండ్‌ను ఆసీస్ చిత్తుచిత్తుగా ఓడించింది.
మొదట బ్యాటింగ్ చేపట్టిన ఇంగ్లాండ్ జట్టు 19.4 ఓవర్లలో 105 పరుగులకు ఆలౌట్ అయింది. ఇంగ్లాండ్ ఓపెనర్ డానియెల్ వైట్(45), కెప్టెన్ నైట్(25) ఇద్దరే రెండంకెల స్కోరు సాధించారు. మిగతా వారంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు.
ఆసీస్ బౌలర్లలో గార్డెనర్ 3, వారెహమ్ 2, మెఘాన్ 2 వికెట్లు దక్కాయి. అనంతరం 106 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిన ఆసీస్ మహిళల జట్టు సునాయాసంగా పరుగులను చేధించింది. 15.1 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను చేధించింది. ఆస్ట్రేలియా తరపున గార్డెనర్(33), లానింగ్(28), హీలీ(22) రాణించారు.
ఫైనల్‌లో బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లో రాణించిన గార్డెనర్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు తాజా విజయంతో ఆస్ట్రేలియా ఖాతాలో నాలుగో టైటిల్ వచ్చి చేరినట్లయింది. ఫ్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు ఆసీస్ ఓపెనర్ హేలీ దక్కించుకుంది. ఇప్పటివరకు ఆరుసార్లు ఈ టోర్నీ నిర్వహించగా అందులో నాలుగుసార్లు ఆస్ట్రేలియా(2010, 12, 14, 18) విజేతగా నిలవడం విశేషం. 2009లో ఇంగ్లాండ్, 2016లో వెస్టిండీస్ ఒకసారి టైటిల్ కైవసం చేసుకున్నాయి. 2020 మహిళల టీ20 ప్రపంచకప్ ఆస్ట్రేలియాలో జరగనుంది.