
పడిపోయిన కోహ్లీ, రోహిత్ ర్యాంకులు
ఐసీసీ టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో భారత్ నుంచి కేఎల్ రాహుల్ టాప్ 10లో ఉన్నాడు. అతని ఖాతాలో 646 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. ఇక ఆ తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ 13వ స్థానానికి, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ 15వ స్థానానికి పడిపోయారు. కెప్టెన్ రోహిత్ శర్మ శ్రీలంకతో సిరీస్‌లో 50 పరుగులు మాత్రమే చేశాడు. ఇక విరాట్ కోహ్లీ వెస్టిండీస్‌తో రెండో టీ20 మ్యాచ్ తర్వాత మళ్లీ ఆడలేదు. ఇవన్నీ ర్యాంకులపై ప్రభావం చూపించాయి.

27 స్థానాలు ఎగబాకిన శ్రేయస్ అయ్యర్
ఇక శ్రీలంకతో టీ20 సిరీస్‌లోని 3 మ్యాచ్‌లలో అజేయ హాఫ్ సెంచరీలతో చెలరేగిన శ్రేయస్ అయ్యర్ 27 స్థానాలు ఎగబాకి 18వ ర్యాంకుకు చేరుకున్నాడు. శ్రీలంకతో సిరీస్‌లో మొత్తంగా 204 పరుగులు చేసిన శ్రేయస్ అయ్యర్ ఒక్క సారి కూడా ఔటవ్వలేదు.

బౌలింగ్‌లో భువి
ఇక ఐసీసీ టీ20 బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో టాప్ 10లో ఏ ఒక్క భారత బౌలర్‌కు కూడా చోటు దక్కలేదు. టాప్ 20లో మాత్రం భువనేశ్వర్ కుమార్ ఒక్కడికి చోటు దక్కింది. శ్రీలంకతో టీ20 సిరీస్‌లో రాణించిన భువనేశ్వర్ కుమార్ 3 స్థానాలు ఎగబాకి 17వ ర్యాంకుకు చేరుకున్నాడు. అదే సమయంలో జస్ప్రీత్ బుమ్రా 3 స్థానాలు దిగజారి 28వ ర్యాంకుకు పడిపోయాడు. ఇక భారత్‌తో రెండో టీ20 మ్యాచ్‌లో 75 పరుగులతో చెలరేగిన శ్రీలంక బ్యాటర్ పాతుమ్ నిస్సాంక 9వ స్థానానికి ఎగబాకాడు.

టాప్ ర్యాంకుల్లో పాక్ ప్లేయర్లు
ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో పాకిస్థాన్ ఓపెనర్లు బాబర్ అజామ్, మహ్మద్ రిజ్వాన్ టాప్ 1,2 ర్యాంకుల్లో కొనసాగుతున్నారు. మూడో స్థానంలో సౌతాఫ్రికా బ్యాటర్ ఎయిడెన్ మాక్రమ్, నాల్గో స్థానంలో ఇంగ్లండ్ బ్యాటర్ డేవిడ్ మలాన్ ఉన్నారు. న్యూజిలాండ్ బ్యాటర్ డేవాన్ కాన్వే ఐదో స్థానంలో, ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ ఆరో స్థానంలో ఉన్నారు. డస్సెన్ ఏడు, మార్టిన్ గుప్తిల్ 8వ స్థానంలో ఉన్నారు.

టెస్ట్ ర్యాంకింగ్స్‌లో అశ్విన్, బుమ్రా
ఇక టెస్ట్ బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో టాప్ 10లో రవి చంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా ఉన్నారు. 839 రేటింగ్ పాయింట్లతో అశ్విన్ రెండో స్థానంలో, 763 రేటింగ్ పాయింట్లతో బుమ్రా పదో స్థానంలో ఉన్నారు. ఇక ఆల్‌రౌండర్ల జాబితాలో అశ్విన్, రవీంద్ర జడేజా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు.


Click it and Unblock the Notifications
