
2022లో టీట్వంటీ ప్రపంచ కప్
ఈ ఏడాది అక్టోబర్‌లో జరగాల్సిన టీట్వంటీ ప్రపంచకప్‌ను వచ్చే ఏడాదికి కాకుండా ఏకంగా 2022కు షెడ్యూల్ చేస్తూ ఐసీసీ నిర్ణయించింది. టీట్వంటీ వరల్డ్ కప్ వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చి నెలల్లో జరుగుతుందని అంతా భావించారు. అయితే అనూహ్యంగా 2022కు ఈ మెగా టోర్నీని షెడ్యూల్ చేయడం జరిగింది. ఇదిలా ఉంటే రెండు మెగా టోర్నీలను 6నెలల సమయంలో నిర్వహించేందుకు ప్రస్తుతం ఉన్న మార్కెట్ పరిస్థితి కూడా అనుకూలంగా లేదని ఐసీసీ చెబుతోంది. అంటే ఈ మ్యాచ్‌లను టెలికాస్ట్ చేసేందుకు స్టార్ స్పోర్ట్స్ ముందుకొస్తున్నప్పటికీ అడ్వర్టైజ్ పరంగా మార్కెట్లు సహకరించే పరిస్థితి లేదని సమాచారం.

రెండు మెగా ఈవెంట్లను నిర్వహించాలంటే...
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రెండు మెగా ఈవెంట్లను నిర్వహించేందుకు మార్కెట్ పరిస్థితులు అనుకూలంగా లేవని చెబుతున్న ఐసీసీ తప్పని పరిస్థితుల్లో టీట్వంటీ ప్రపంచకప్‌ను 2022కు షెడ్యూల్ చేస్తున్నట్లు వివరణ ఇచ్చింది. ముందుగా టోర్నమెంటును వాయిదా వేస్తున్నామే తప్ప రద్దు చేయడం లేదనేది గ్రహించాలని ఐసీసీ విజ్ఞప్తి చేసింది. అదే సమయంలో 2022లో ప్రపంచ స్థాయి మ్యాచ్‌లు ఏవీ లేకపోవడంతో టీట్వంటీ ప్రపంచ కప్ అప్పుడు నిర్వహించడమే కరెక్ట్ అన్న నిర్ణయానికి వచ్చినట్లు ఐసీసీ వెల్లడించింది.

2022లో ఆస్ట్రేలియాలో టీ ట్వంటీ ప్రపంచకప్
ఇక కొత్త షెడ్యూల్ ప్రకారం 2021లో భారత్ ఒక టీట్వంటీ ప్రపంచకప్‌కు ఆతిథ్యం ఇవ్వనుండగా ఈ ఏడాది జరగాల్సిన టీట్వంటీ ప్రపంచకప్‌ను ఆస్ట్రేలియా 2022లో ఆతిథ్యం ఇస్తుందని ఐసీసీ తెలిపింది. ఆ తర్వాత 2023లో భారత్ ఐసీసీ వన్డే ప్రపంచకప్‌కు ఆతిథ్యం ఇస్తుందని స్పష్టం చేసింది. అయితే ఇప్పటి వరకు మాటలు మాత్రమే జరిగాయని చెప్పిన ఐసీసీ మే 28న జరిగే సమావేశంలో తుది నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని స్పష్టం చేసింది. ఈ కొత్త షెడ్యూల్‌కు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కూడా ఆమోదం తెలిపే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇక ఈ షెడ్యూల్‌కు అధికారికంగా గ్రీన్ సిగ్నల్ లభిస్తే ఈ ఏడాది ఐపీఎల్ నిర్వహణకు లైన్ క్లియర్ అవుతుందని ఐసీసీ చెబుతోంది.

ఐపీఎల్‌పై బీసీసీఐ ఏం చెబుతోంది..?
కరోనావైరస్ నియంత్రణలో ఉంటే అక్టోబర్ నెలలో ఐపీఎల్ వాస్తవరూపం దాలుస్తుందని బీసీసీఐ చెబుతోంది. జూలైలో దీనిపై అధికారిక ప్రకటన వెలువడుతుందని సమాచారం. అయితే ఇది పూర్తిగా వైరస్‌ను బట్టే ఉంటుందని చెప్పుకొచ్చింది. ఎందుకంటే ఈ మెగా ఈవెంట్‌కు ప్లేయర్లు, సిబ్బంది, ప్రేక్షకుల కదలికలు వీటన్నిటిపై దృష్టి సారించాల్సి ఉంటుందని బీసీసీఐ వెల్లడించింది.