వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్‌కు ఐసీసీ బిగ్ షాక్!
ఐసీసీ తాజాగా విడుదల చేసిన పురుషుల టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో భారత యువ ఆటగాళ్లు అగ్రస్థానాల్లో తమ హవాను కొనసాగిస్తున్నారు. టీమిండియా యువ సంచలనం, లెఫ్ట్ హ్యాండ్ ఓపెనర్ ఇషాన్ కిషన్ తన నంబర్ వన్ స్థానాన్ని విజయవంతంగా కాపాడుకోగా.. మరో ఎడమచేతి వాటం బ్యాటర్ అభిషేక్ శర్మ కూడా తన రెండో స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. ప్రపంచ క్రికెట్‌లో ఈ ప్రతిభావంతులైన ఇద్దరు భారత ఆటగాళ్లు టాప్-2 లో నిలవడం భారత అభిమానులలో ఉత్సాహాన్ని నింపుతోంది.
సూర్యకు బిగ్ షాక్
అయితే ఇదే సమయంలో టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‌కు ఈ ర్యాంకింగ్స్‌లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గతంలో ఐసీసీ ర్యాంకింగ్స్‌లో దూసుకుపోయిన సూర్యకుమార్ యాదవ్ ఏకంగా ఐదు స్థానాలు దిగజారి 13వ స్థానానికి పడిపోయాడు. ప్రస్తుతం సూర్యకుమార్ యాదవ్ ఖాతాలో 687 రేటింగ్ పాయింట్లు మాత్రమే ఉన్నాయి. మార్చి 2026లో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో తన కెప్టెన్సీతో భారత్‌ను విజేతగా నిలిపిన సూర్యకుమార్, ఇటీవలి మ్యాచ్‌లలో నిలకడలేని ప్రదర్శన కారణంగా టాప్-10 రేసులో నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది.

దూసుకొచ్చిన ఇంగ్లండ్ యువ స్టార్ జేకబ్ బెథెల్
ఇంగ్లండ్ యువ బ్యాటర్ జేకబ్ బెథెల్ తాజా టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో పెను సంచలనం సృష్టించాడు. టీమిండియాతో ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో కేవలం 46 బంతుల్లోనే 76 పరుగులు చేసి అజేయంగా నిలిచిన బెథెల్ జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. ఈ అద్భుత ప్రదర్శనకు గాను ఆ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించడమే కాకుండా, ర్యాంకింగ్స్‌లో ఏకంగా ఏడు స్థానాలు ఎగబాకి కెరీర్ బెస్ట్ 8వ ర్యాంకుకు చేరుకున్నాడు. ప్రస్తుతం 708 రేటింగ్ పాయింట్లతో ఉన్న ఈ ఇంగ్లండ్ బ్యాటర్ తన సహచరుడు జోస్ బట్లర్ కంటే కేవలం ఒకే ఒక్క పాయింట్ వెనుకబడి ఉన్నాడు.
బౌలింగ్ విభాగంలోనూ నిరాశే..
మరోవైపు బౌలింగ్ విభాగంలోనూ భారత ఆటగాళ్లకు నిరాశే ఎదురైంది. భారత ప్రధాన బౌలర్లు వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్ రెండేసి స్థానాలు దిగజారి వరుసగా 5, 8, 17 స్థానాలకు పడిపోయారు. అయితే ఇంగ్లండ్ సీనియర్ లెగ్ స్పిండర్ ఆదిల్ రషీద్ ఐసీసీ ర్యాంకింగ్స్‌లో పుంజుకున్నాడు. ట్రెంట్ బ్రిడ్జ్ టీ20 మ్యాచ్‌లో భారత్‌పై రెండు కీలక వికెట్లు తీసి రాణించిన రషీద్ ఒక స్థానాన్ని ఎగబాకి ప్రపంచ నంబర్ 3 బౌలర్‌గా నిలిచాడు.
ఐసీసీ పురుషుల టీ20 ఆల్ రౌండర్ల జాబితాలో భారత్‌కు చెందిన హార్దిక్ పాండ్యా ఒక స్థానాన్ని కోల్పోయి మూడో స్థానానికి పడిపోయాడు. ఇదే సమయంలో ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ విల్ జాక్స్ ఆరు స్థానాలు ఎగబాకి ఏడో స్థానానికి చేరుకోవడంలో విజయవంతమయ్యాడు. భారత్‌తో జరిగిన ఇటీవలి సిరీస్‌లో తిలక్ వర్మ, వైభవ్ సూర్యవంశీ వికెట్లను తీసి విలువైన సహకారాన్ని అందించిన జాక్స్ తన ర్యాంకును మెరుగుపరుచుకున్నాడు. ప్రస్తుతం మారిన ఈ ర్యాంకింగ్స్ సమీకరణాలు ఇరు జట్ల ఆటగాళ్లకు భవిష్యత్ ప్రణాళికలను మార్చుకోవాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తున్నాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications