
హైదరాబాద్: శ్రీలంక క్రికెట్ మరింత సంక్షోభం దిశగా పయనిస్తోంది. తాజాగా మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణల నేపథ్యంలో శ్రీలంక బౌలింగ్ కోచ్ నువాన్ జోయ్సాను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) సస్పెండ్ చేసింది. శ్రీలంక-ఇంగ్లాండ్ జట్ల మధ్య మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ ఘటనతో ఆ జట్టు మరిన్ని ఇబ్బందుల్లో పడనుంది.
"జోయ్సాను వెంటనే సస్పెండ్ చేస్తున్నాం. అభియోగాలకు అతడు నవంబరు 1 లోగా సమాధానమివ్వాలి. ఈ విషయంపై ఈ దశలో ఐసీసీ ఇంకేమీ వ్యాఖ్యానించదు" అని ఐసీసీ ఒక ప్రకటనలో తెలిపింది. తాను ఫిక్సింగ్ చేయడంతో పాటు ఆటగాళ్లను కూడా అందుకు ప్రోత్సహించాడన్నది జోయ్సాపై అభియోగం ఉంది.
ప్రస్తుతం శ్రీలంక క్రికెట్‌లో అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఐసీసీ ఆ దేశ బోర్డుపై విచారణకు ఆదేశించింది. మాజీ పేసర్ అయిన జోయ్సా శ్రీలంక తరఫున 30 టెస్టులు, 95 వన్డే మ్యాచ్‌లు ఆడాడు. 2015 సెప్టెంబరులో ఆ జట్టు బౌలింగ్ కోచ్‌గా నియమితుడయ్యాడు.