
హైదరాబాద్: ఆప్ఘనిస్థాన్ వికెట్ కీపర్ మహ్మద్ షెజాద్ డోపింగ్ పరీక్షలో విఫలమయ్యాడు. దీంతో అతనిపై ఏడాది పాటు సస్పెన్షన్ విధిస్తున్నట్లు ఐసీసీ ప్రకటించింది. 29 ఏళ్ల షాజాద్ బరువు తగ్గడానికి వాడుతున్న హైడ్రోక్సీకట్ మందులో క్లెనబుటరోల్ అనే నిషేధిత ఉత్ప్రేరకం ఉన్నట్లు పరీక్షలో తేలిందని ఐసీసీ వెల్లడించింది.
గత జనవరి 17న డోపింగ్ టెస్టుకు తన మూత్రం శాంపిల్ ఇచ్చినపుడు అతడు నిషేధిత ఉత్ర్పేరకం క్లెనబుటరోల్ సేవించినట్టు వెల్లడైంది. ఐసీసీ డోపింగ్ నిరోధక నియమావళిలోని ఆర్టికల్ 2.1ను అతను ఉల్లంఘించినట్లు ఐసీసీ తేల్చింది. నిబంధనల ప్రకారం అతనిపై నిషేధం విధించినట్టు ఐసీసీ వెల్లడించింది.
అయితే, బరువును తగ్గించుకునే క్రమంలో తనకు తెలియకుండానే ఈ తప్పు జరిగిందని షెజాద్ ఐసీసీ ముందు అంగీకరించడం విశేషం. షాజాద్ 58 వన్డేలు, 58 టీ20 మ్యాచ్‌లలో అఫ్ఘానిస్తాన్‌కు ప్రాతినిథ్యం వహించాడు. షెజాద్‌పై నిషేధం వచ్చే జనవరి 17న ముగియనున్నట్టు ఐసీసీ జనరల్ మేనేజర్ జెఫ్ అలార్డైస్ తెలిపారు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.