
జింబాబ్వే క్రికెట్ జట్టుపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) సీరియస్ అయింది. జింబాబ్వే ప్రభుత్వం తమ రాజ్యాంగాన్ని అతిక్రమించినందుకు జింబాబ్వే క్రికెట్‌ను గురువారం ఐసీసీ సస్పెండ్ చేసింది. ఈ సస్పెన్షన్ వెంటనే అమల్లోకి వస్తుందని కూడా ఐసీసీ తెలిపింది. ప్రస్తుత క్రికెట్ బోర్డులోని సభ్యులను జింబాబ్వే ప్రభుత్వ ఏజెన్సీ అయిన స్పోర్ట్స్ అండ్ రిక్రియేషన్ కమిటీ తొలగించడమే ఐసీసీ నిర్ణయానికి కారణం.
జింబాబ్వే ప్రభుత్వంపై ఆర్టికల్ 2.4 (సి) (డి) నిబంధనను అతిక్రమించినందుకు శాశ్వత సభ్యదేశమైన జింబాబ్వేపై వేటు వేయాలని ఐసీసీ నిర్ణయం తీసుకుంది. దీంతో ఐసీసీ నుంచి వచ్చే నిధులు ఆగిపోవడమే కాకుండా ఏ టోర్నీల్లోనూ జింబాబ్వే జట్టు ఆడేందుకు వీలుండని స్పష్టం చేసింది. ఇక మరో మూడు నెలల్లో జింబాబ్వే క్రికెట్ బోర్డు సభ్యులను తిరిగి నియమించాలని ఐసీసీ ఆదేశించింది. ఎలాంటి రాజకీయ జోక్యం లేకుండా క్రికెట్ కొనసాగాలని కోరుకుంటున్నామని ఐసీసీ తెలిపింది.
'రాజకీయ జోక్యం లేకుండా క్రికెట్ కొనసాగాలని మేము ప్రయత్నిస్తున్నాం' అని ఐసిసి చైర్మన్ శశాంక్ మనోహర్ తెలిపారు. అక్టోబర్‌లో జరిగే టీ20 ప్రపంచకప్ క్వాలిఫైయర్‌లో జింబాబ్వే పాల్గొననుంది. ఇంతలోనే ఐసీసీ కోపానికి బలైంది. మరి ఐసీసీ శాంతించి తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటూ చూడాలి. జూన్ 2014లో జింబాబ్వే తన టెస్ట్ హోదాను కోల్పోయింది.