వన్డే వరల్డ్ కప్ ఫైనల్ లో టీమిండియాపై ఆస్ట్రేలియా గెలిచి ట్రోఫీని సాధించిన విషయం తెలిసిందే. టోర్నీ ఆరంభం నుంచి సంచలన ప్రదర్శనలతో ఫైనల్ కు దూసుకొచ్చిన రోహిత్ సేన తుదిపోరులో తడబడింది. మరోవైపు ఆదిలో తడబడి తర్వాత గొప్పగా పుంజుకుని ఫైనల్ కు వచ్చిన ఆసీస్ ఛాంపియన్ గా నిలిచింది. అయితే ఐసీసీ తాజాగా నవంబర్ నెలకు ఆసీస్ ప్లేయర్ ట్రావిస్ హెడ్ కు 'ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది అవార్డు'ను ప్రకటించింది.
అయితే ఈ అవార్డుకు ముగ్గురు ఆటగాళ్లు పోటీపడ్డారు. ఆసీస్ ఆటగాళ్లు ట్రావిస్ హెడ్, గ్లెన్ మాక్స్ వెల్, టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమి అవార్డు కోసం తలపడ్డారు. వరల్డ్ కప్ సెమీస్, ఫైనల్ లో హెడ్ రాణించాడు. సౌతాఫ్రికాతో జరిగిన సెమీస్ లో 48 బంతుల్లో 62 పరుగులు చేయడంతో పాటు హెడ్ రెండు కీలక వికెట్లు పడగొట్టాడు. ఇక ఫైనల్ లో 120 బంతుల్లో 137 పరుగులు చేసి విజయంలో కీలక పాత్ర పోషించాడు.

మరోవైపు మాక్స్ వెల్ అఫ్గానిస్థాన్ మ్యాచ్ లో సంచలన ప్రదర్శనతో అవార్డుకు నామినేట్ అయ్యాడు. అఫ్గాన్ పై అతడు డబుల్ సెంచరీ సాధించాడు. 91 పరుగులకే ఆసీస్ ఏడు వికెట్లు కోల్పోయినా ఆ జట్టు 292 పరుగుల టార్గెట్ ను ఛేదించిందంటే మాక్సీ విధ్వంసమే కారణం. అంతేగాక వరల్డ్ కప్ అనంతరం టీమిండియాతో జరిగిన టీ20 సిరీస్ లోనూ మాక్స్ వెల్ సెంచరీ చేశాడు. 48 బంతుల్లో 104 పరుగులు చేసి ఆసీస్ ను మూడో టీ20లో గెలిపించాడు.
ఇక, జట్టులోకి కాస్త ఆలస్యంగా వచ్చిన షమి తర్వాత వికెట్ల వేట కొనసాగించాడు. ప్రపంచకప్ లో 24 వికెట్ల సాధించి టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచాడు. లంకతో జరిగిన మ్యాచ్ లో 18 పరుగులకే అయిదు వికెట్లు షమి తీశాడు. అంతేగాక న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లోనూ షమి అయిదు వికెట్లతో సత్తాచాటాడు.
అయితే ఐసీసీ ఓటింగ్ అకాడమీ, ఫ్యాన్స్ వేసిన ఓట్ల ఫలితంగా ప్రకటించిన ఈ అవార్డును హెడ్ దక్కించుకున్నాడు. ఓట్ విలువలో ఐసీసీ ఓటింగ్ అకాడమీకి 90 శాతం, ఫ్యాన్స్ కు 10 శాతం షేర్ ఉంటుంది. ఉమెన్స్ విభాగంలో నవంబర్ నెలకు బంగ్లాదేశ్ ప్లేయర్ నహిదా అక్తెర్ అవార్డును అందుకుంది.