ఛాంపియన్స్ ట్రోఫీ ముందు టీమిండియా యంగ్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ తాజా ర్యాంకింగ్స్ లో దూసుకెళ్లాడు. వన్డేల్లో వరల్డ్ నెం.1 బ్యాటర్ గా అవతరించాడు. పాకిస్థాన్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజమ్ ను వెనక్కినెట్టి ఈ మార్క్ టచ్ చేశాడు. ఇంగ్లాండ్ పై జరిగిన మూడు మ్యాచుల సిరీస్ లో సన్సేషనల్ పెర్ఫామెన్స్ చేసి ఈ ఘనత సాధించాడు. ఇంగ్లాండ్ పై అతడు ఓ సెంచరీ, రెండు అర్ధ శతకాలు బాదాడు. మొత్తంగా 86.99 సగటుతో 259 పరుగులు చేశాడు.
గత వారం ర్యాంకింగ్స్ లో బాబార్ ఆజామ్ కు కేవలం 5 పాయింట్ల దూరంలో ఉన్నాడు శుభ్‌మన్ గిల్. అయితే తాజాగా బాబర్ 13 పాయింట్లు కిందకు పడిపోగా, గిల్ 15 పాయింట్లు ఎగబాకాడు. దీంతో బాబర్ 776 పాయింట్లతో రెండో స్థానంలో నిలవగా.. గిల్ 769 పాయింట్ల అగ్రస్థానాన్ని సంపాదించుకున్నాడు. ఇక టాప్ -10లో మొత్తంగా గిల్ తో పాటు మరో ముగ్గురు టీమిండియా క్రికెటర్లు కూడా నిలిచారు. కెప్టెన్ రోహిత్ శర్మ 761 పాయింట్లో మూడో ర్యాంకును దక్కించుకున్నాడు. విరాట్ కోహ్లీ 727 పాయింట్లతో ఆరో స్థానంలో నిలవగా.. శ్రేయస్ 679 పాయింట్లతో 9వ ర్యాంకులో నిలిచాడు.

రెండో సారి..
వన్డేల్లో గిల్ నెం.1 బ్యాటర్‌గా నిలవడం ఇది రెండో సారి కావడం విశేషం. అంతకుముందు 2023లోనూ వన్డే వరల్డ్ కప్ సమయంలోనూ బాబర్‌ను అధిగమించి గిల్ అగ్రస్థానానికి చేరుకున్నాడు.
టాప్-4లో కుల్‌దీప్ యాదవ్..
బౌలర్ల విభాగంలో శ్రీలంక ప్లేయర్ మహీశ్ తీక్షణ అఫ్గానిస్థాన్ కెప్టెన్ రషీద్ ఖాన్‌ను దాటి అగ్రస్థానానికి చేరుకున్నాడు. బెర్నార్డ్ స్కోల్జ్ (నమీబియా) మూడో ర్యాంకు దక్కించుకోగా.. కుల్‌దీప్ యాదవ్ (టీమిండియా) నాలుగో స్థానంలో నిలిచాడు.