జూన్‌లో టీ20 ప్రపంచకప్ జరగనుంది. ఈ మెగాటోర్నీకి అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి. అయితే ఈ మెగా ఈవెంట్‌తో ఐసీసీ కొత్త నిబంధనలను అమల్లోకి తీసుకువస్తుంది. టీ20 వరల్డ్ కప్‌తో పాటు వైట్ బాల్ క్రికెట్‌లో స్టాప్ క్లాక్ రూల్ అమలు చేయనుంది. దీని ప్రకారం మ్యాచ్‌లో ఫీల్టింగ్ జట్టు 60 సెకన్ల లోపు తదుపరి ఓవర్ వేయాలి. అలా జరగని పక్షంలో ఫీల్డింగ్ జట్టుకు అంపైర్లు రెండు సార్లు హెచ్చరిస్తాడు. ఆ తర్వాత అయిదు పరుగుల పెనాల్టీ విధిస్తాడు.
బ్యాటర్లు సమీక్ష కోరడం, ఇతరత్ర కారణాల విషయాల్లో 60 సెకన్లకు మినహాయింపు ఉంటుంది. అయితే ఆ ఆలస్యాన్ని నిర్ణయించే అధికారం అంపైర్లుకు మాత్రమే ఉంటుంది. గతేడాది డిసెంబర్ నుంచి ఈ రూల్‌ను ఐసీసీ ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టింది. తాజాగా దాన్ని టీ20లతో పాటు వన్డేల్లో అమలు చేయాలని నిర్ణయించింది.

ఓవర్ అనంతరం స్క్రీన్‌పై 60 సెకన్ల టైమర్ మొదలవుతుంది. క్రమంగా 60 నుంచి ఒక్కో నంబర్ తగ్గుతూ సున్నా వచ్చేలోపు ఫీల్డింగ్ జట్టు తదుపరి ఓవర్ ప్రారంభించాలి. మ్యాచ్‌లను సకాలంలో ముగించాలనే ఉద్దేశంతో ఈ నిబంధన తీసుకువచ్చినట్లు ఐసీసీ వెల్లడించింది. సాధారణంగా ఈ రూల్‌ను ఏప్రిల్ వరకు పరీక్షించి అభిప్రాయాలను తీసుకుని ఐసీసీ అంతిమ నిర్ణయాన్ని వెల్లడించాల్సి ఉంది. కానీ ఐసీసీ ముందుగానే దీనిపై నిర్ణయం తీసుకుంది.
మరోవైపు టీ20 వరల్డ్ కప్‌లో సెమీఫైనల్స్, ఫైనల్‌కు రిజర్వ్ డే ఉంటుదని ఐసీసీ వెల్లడించింది. అలాగే గ్రూప్ స్టేజ్, సూపర్-8 మ్యాచ్‌ల ఫలితాన్ని ప్రకటించడానికి కనీసం 5 ఓవర్లు, అలాగే సెమీస్, ఫైనల్ ఫలితాన్ని నిర్ణయించడానికి కనీసం 10 ఓవర్ల పాటు రెండో ఇన్నింగ్స్‌లో బౌలింగ్ చేయాల్సి ఉంటుందని తెలిపింది.
ఈ కొత్త నిబంధనలు భారత్‌కు సానుకూలంగానే ఉన్నాయి. మెగాటోర్నీలో టీమిండియాను నడిపించే రోహిత్ శర్మకు కెప్టెన్సీలో అపారమైన అనుభవం ఉంది. 60 సెకన్లలోపే ప్రత్యర్థికి తగ్గట్లుగా ఫీల్డింగ్‌ను మోహరించగలడని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అంతేగాక మన స్పిన్నర్లు, పేసర్ల ఫిట్‌నెస్ మెరుగ్గానే ఉంటుందని, అలసటతో ఆలస్యం చేసే అవకాశాలు చాలా తక్కువ అని అంటున్నారు.
అలాగే సెమీఫైనల్స్, ఫైనల్‌లో కనీసం 10 ఓవర్లు పాటు మ్యాచ్ సాగాలనే నిబంధన అత్యుత్తమ జట్టును విజేతగా నిలవడంలో సాయపడుతుందని తెలుపుతున్నారు. అయిదు ఓవర్ల పాటే మ్యాచ్ జరిగితే భారీ హిట్టర్లు ఉన్న జట్టుకు ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. మన జట్టులో హిట్టర్లతో పాటు సంయమనంతో ఆడే బ్యాటర్లు ఉన్నారు.