
ఐసీసీ తాజాగా విడుదల చేసిన మెన్స్ టీ20, మెన్స్ వన్డే టీమ్ ఆఫ్ 2021లో భారత ఆటగాళ్లకు తీవ్ర నిరాశ ఎదురైంది. ఇటు టీ20 టీంలో కానీ, అటు వన్డే టీంలో కానీ ఒక్క భారత ఆటగాడికి కూడా చోటు దక్కలేదు. అయితే ఇలా ఐసీసీ విడుదల చేసిన ఒక సంవత్సరం వన్డే, టీ20లో ఒక్క భారత ఆటగాడికి కూడా చోటు దక్కక పోవడం ఇదే తొలిసారి. దీంతో ఇటు ఆటగాళ్లతోపాటు అటు అభిమానులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. అయితే వన్డే, టీ20 రెండు టీంలకు కూడా పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ కెప్టెన్‌గా ఎంపికవడం విశేషం.
వన్టే జట్టులో ఐర్లాండ్‌కు చెందిన పార్ల్ స్టిరింగ్, సౌతాఫ్రికాకు చెందిన మలాన్ ఓపెనర్లుగా ఎంపికయ్యారు. ఇక పాకిస్థాన్‌కు చెందిన ఫకర్ జమాన్, సౌతాఫ్రికాకు చెందిన డస్సెన్ బ్యాటర్లుగా ఎంపికయ్యారు. ఇక ఆల్‌రౌండర్‌గా బంగ్లాదేశ్ ఆటగాడు షకీబుల్ హాసన్ ఎంపికయ్యాడు. వికెట్ కీపర్‌గా కూడా బంగ్లాదేశ్ ఆటగాడు ముష్కీయర్ రహీం ఎంపికయ్యాడు. ఇక శ్రీలంకకు చెందిన వానిండు హారంగా, బంగ్లాదేశ్‌కు చెందిన ముస్తిఫిజర్ రహ్మాన్, ఐర్లాండ్‌కు చెందిన సిమి సింగ్, శ్రీలంకకు చెందిన దుష్మంత చమీర ఐసీసీ వన్డే జట్టులో బౌలర్లుగా ఎంపికయ్యారు.
ఇక ఐసీసీ టీ20 జట్టు 2021కు కూడా పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామే కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఈ జట్టులో ఓపెనర్లుగా ఇంగ్లండ్‌కు చెందిన జోస్ బట్లర్, పాకిస్థాన్‌కు చెందిన మహ్మద్ రిజ్వాన్ ఎంపికయ్యారు. మహ్మద్ రిజ్వానే వికెట్ కీపర్‌గా కూడా ఎంపికయ్యాడు. సౌతాఫ్రికాకు చెందిన ఐడెన్ మార్కామ్, డేవిడ్ మిల్లర్, న్యూజిలాండ్‌కు చెందిన మిచెల్ మార్ష్ బ్యాటర్లుగా ఎంపికయ్యారు. ఇక బౌలర్లుగా సౌతాఫ్రికా ఆటగాడు షంసీ, ఆస్ట్రేలియా ఆటగాడు జోష్ హేజిల్‌వుడ్, శ్రీలంక ఆటగాడు హసరంగ, బంగ్లాదేశ్ ఆటగాడు ముస్తిఫిజర్ రహ్మాన్, పాకిస్థాన్ ఆటగాడు షాహీన్ ఆఫ్రిదీ ఎంపికయ్యారు. బాబర్ అజామ్, ముస్తిఫిజర్ రహ్మాన్ ఇటు వన్డే, అటు టీ20 జట్టులో చోటు సంపాదించుకున్నారు.
కాగా 2021 ఏడాదిలో టీమిండియా వన్డే, టీ20 మ్యాచ్‌లు తక్కువగా ఆడడం కూడా ఐసీసీ జట్టులో స్థానం దక్కకపోవడానికి కారణంగా చెప్పవచ్చు. ఆడిన తక్కువ మ్యాచ్‌ల్లో కూడా భారత ఆటగాళ్లు గొప్ప ఫర్‌ఫామెన్స్ ఇవ్వలేకపోయారు. ముఖ్యంగా టీ20 వరల్డ్‌కప్‌లో అంచనాలు అందుకోలేకపోయారు. అందుకే ఆ ప్రపంచకప్‌లో టీమిండియా కూడా లీగ్ స్టేజ్‌లోనే నిష్క్రమించింది. దీంతో ఈ ఏడాది అయినా టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా సత్తా చాటాలని అభిమానులు ఆశిస్తున్నారు.