అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తమ బోర్డ్ మీటింగ్‌లో కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో ముఖ్యంగా కొత్త రెవెన్యూ డిస్ట్రిబ్యూషన్ మోడల్‌కు ఆమోదం లభించింది. దీని ప్రకారం, భారత క్రికెట్ కౌన్సిల్ (బీసీసీఐ)కి భారీగా ఆదాయం రానుంది. ఐసీసీ రెవెన్యూలో బీసీసీఐకి సుమారు 38.4 శాతం దక్కనుంది. మరే దేశానికి ఇంత షేర్ దక్కలేదు.
రెండో ప్లేస్‌లో ఉన్న ఈసీబీ (ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు)కు కేవలం 6.89 శాతం షేర్ మాత్రమే దక్కనుంది. ఇక మూడ స్థానంలో ఉన్న సీఏ (క్రికెట్ ఆస్ట్రేలియా)కు 6.25 శాతం రెవెన్యూ లభిస్తుంది. వీటితో పోలిస్తే బీసీసీఐకి దక్కే రెవెన్యూ ఏకంగా ఆరు రెట్లకు పైగానే ఉండటం గమనార్హం. ఈ రెవెన్యూ డిస్ట్రిబ్యూషన్ మోడల్ వచ్చే నాలుగేళ్ల పాటు అమల్లో ఉంటుంది.

ఫ్రాంచైజీ క్రికెట్‌కు మరీ పాపులారిటీ పెరిగిపోతున్న తరుణంలో.. అంతర్జాతీయ క్రికెట్‌ను కాపాడేందుకు ఐసీసీ మరో కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఫ్రాంచైజీ క్రికెట్ లీగ్ ఏదైనా సరే.. ఒక టీంలో కేవలం నలుగురు విదేశీ ప్లేయర్లనే అనుమతించాలని తేల్చిచెప్పింది. ఈ నిర్ణయానికి ప్రధాన కారణం ఇంటర్నేషనల్ లీగ్ టీ20 (ఐఎల్‌టీ20) వంటి లీగ్స్ అని సమాచారం. ఎందుకంటే ఐఎల్‌టీ20లో ఒక్కో టీంల 9 మంది విదేశీ ప్లేయర్లు ఉండొచ్చు.
ఇటీవల అమెరికాలో ప్రారంభమైన మేజర్ లీగ్ క్రికెట్‌లో కూడా ఒక్కో టీంలో ఆరుగురు విదేశీ ప్లేయర్లను ఆడించేందుకు అనుమతించారు. ఇలా చేయడం వల్ల అంతర్జాతీయ క్రికెట్‌కు నష్టం జరుగుతుందని ఐసీసీ భావించింది. అందుకే ఒక్కో టీంలో కేవలం నలుగురు విదేశీ ప్లేయర్లనే ఆడించాలని రూల్ తీసుకొచ్చింది. భారత్‌లో ఆడే ఐపీఎల్‌లో ఇదే నిబంధనను ఆరంభం నుంచి పాటిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ కొత్త రూల్స్ ప్రకారం ప్రతి లీగ్ టీంలో ఏడుగురు స్వదేశీ లేదా అసోసియేట్ దేశాలకు చెందిన ప్లేయర్లు ఆడాల్సిందే. మిగతా నాలుగు స్థానాల్లోనే అంతర్జాతీయ ప్లేయర్లను ఆడిస్తారు. అంతేకాదు, ఇలా ఏయే దేశాల ఆటగాళ్లను ఆడిస్తున్నారో ఆయా దేశ క్రికెట్ బోర్డులకు ఆ లీగ్‌లు కొంత ఫీజు చెల్లించాలని కూడా ఐసీసీ సూచించింది.