Handshake Controversy: ఆసియా కప్ 2025లో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ప్రవర్తన ఐసీసీకి తలనొప్పిగా మారింది. కరచాలనం వివాదంపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) వ్యవహరించిన తీరుపై ఐసీసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. సెప్టెంబర్ 17న యూఏఈతో మ్యాచ్‌కు ముందు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు వ్యవహరించిన తీరుపై ఐసీసీ తీవ్రంగా స్పందించింది. పీసీబీ పలు టోర్నమెంట్ నిబంధనలను ఉల్లంఘించినట్లు పేర్కొంటూ ఐసీసీ సీరియస్ వార్నింగ్ ఇచ్చింది.
పీసీబీకి ఐసీసీ సీరియస్ వార్నింగ్
ఐసీసీ సీఈఓ సజోగ్ గుప్తా పీసీబీకి ఒక ఈమెయిల్ పంపారు. ఇందులో మ్యాచ్ రోజు పీసీబీ ప్రవర్తించిన తీరును ఎత్తి చూపారు. ముఖ్యంగా, 'ప్లేయర్స్ అండ్ మ్యాచ్ ఆఫీషియల్స్ ఏరియా (PMOA)' నిబంధనలను పీసీబీ పదేపదే ఉల్లంఘించిందని తెలిపారు. మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్, పాక్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా, పాక్ కోచ్ మైక్ హెస్సన్ మధ్య జరిగిన సమావేశాన్ని పీసీబీ రికార్డు చేయడానికి ప్రయత్నించింది. ఐసీసీ మీడియా మేనేజర్లకు ఈ సమావేశాల్లో పాల్గొనడానికి అనుమతి లేదని స్పష్టంగా చెప్పినప్పటికీ.. పీసీబీ తన మీడియా మేనేజర్ ను తీసుకొచ్చిందని ఐసీసీ పేర్కొంది.

తన మీడియా మేనేజర్ ను సమావేశంలోకి అనుమతించకపోతే మ్యాచ్ నుంచి తప్పుకుంటామని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు బెదిరించినట్లు ఐసీసీ వర్గాలు వెల్లడించాయి. దీనిని తీవ్రంగా పరిగణించిన ఐసీసీ చివరికి మ్యాచ్‌ను కాపాడటానికి పీసీబీ డిమాండ్‌ను అంగీకరించింది. అయితే, ఇది PMOA నియమాలకు విరుద్ధమని ఐసీసీ తన ఈమెయిల్‌లో స్పష్టం చేసింది.
ఐసీసీ పంపిన ఈమెయిల్‌లో మరో ముఖ్య అంశాన్ని కూడా ఐసీసీ ప్రస్తావించింది. పీసీబీ మీడియాకు విడుదల చేసిన పత్రికా ప్రకటనలో, పైక్రాఫ్ట్ క్షమాపణలు చెప్పినట్లు పేర్కొనడంపై ఐసీసీ అభ్యంతరం తెలిపింది. వాస్తవానికి, పైక్రాఫ్ట్ ఒక కమ్యూనికేషన్ లోపంపై మాత్రమే విచారం వ్యక్తం చేశారని ఐసీసీ వెల్లడించింది. ఐసీసీ ఈ అంశంపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఎలా స్పందిస్తుందోనని వేచి చూస్తోంది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు స్పందించకపోతే.. తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది. పీసీబీ ప్రవర్తన ఆట నియమాలకు, స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని ఐసీసీ భావిస్తోంది.