శ్రీలంక స్టార్ క్రికెటర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ నయా ఆల్‌రౌండర్ వానిందు హసరంగ చేసిన పనికి ఐసీసీ తమ నిబంధనలు మార్చుకునే పరిస్థితి ఎదురయ్యేలా ఉంది. అయితే హసరంగ కావాలని చేశాడా లేదా యాదృచ్చికంగా జరిగిందా అనే విషయంపై స్పష్టత లేదు. కానీ ఒకవేళ ప్లాన్ ప్రకారమే చేశాడంటే హసరంగ తెలివికి ఐసీసీ బిత్తరపోయినట్లే.
అసలేం జరిగిందంటే..బంగ్లాదేశ్‌తో రెండు టెస్టుల సిరీస్‌లో పాల్గొనకుండా హసరంగపై ఐసీసీ నిషేధం విధించింది. ఇటీల బంగ్లాదేశ్‌తో జరిగిన చివరి వన్డేలో అంపైర్ నిర్ణయంపై హసరంగ కాస్త దురుసగా నిరసన తెలిపినందుకు ఐసీసీ ఈ చర్యలు తీసుకుంది. తన టోపీని అంపైర్ నుంచి బలవంతంగా లాక్కున్నాడు.దీనిపై సీరియస్ అయిన ఐసీసీ అని మ్యాచ్ ఫీజులో 50% జరిమానా విధించింది. అంతేగాక మూడు అయోగ్యత పాయింట్లు ఇచ్చింది.

దీంతో గత 24 నెలల్లో హసరంగ ఖాతాలో డీమెరిట్ పాయింట్లు ఎనిమిదికి చేరాయి. ఐసీసీ నిబంధనల్లో ఆర్టికల్ 7.6 ప్రకారం ఆ డీమెరిట్ పాయింట్లు నాలుగు సస్పెన్షన్ పాయింట్లుగా మారుతాయి. ఈ కారణంగా అతడు రెండు టెస్టులు లేదా నాలుగు వన్డేలు లేదా నాలుగు టీ20 మ్యాచ్‌లకు నిషేధాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. మరోవైపు ఏప్రిల్, మే నెలలో శ్రీలంకకు టీ20, వన్డే సిరీస్‌లు ఏమీ లేవు. జూన్‌లో జరగనున్న టీ20 ప్రపంచకప్ మాత్రమే తర్వాత జరగబోయే లిమిటెడ్ ఓవర్ల సిరీస్.
దీంతో హసరంగ టీ20 ప్రపంచకప్‌లో తొలి నాలుగు మ్యాచ్‌లకు నిషేధం ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే గతేడాది ఆగస్టులోనే హసరంగ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇక అతడికి మిగిలింది పరిమిత ఓవర్ల మ్యాచ్‌లే. కానీ హసరంగ తెలివిగా తన టెస్టు రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకున్నాడు. మార్చి 22 నుంచి ప్రారంభం కానున్న బంగ్లాదేశ్ సిరీస్ ఆడతానని శ్రీలంక క్రికెట్ బోర్డుకు తెలియజేశాడు. దీంతో బంగ్లా సిరీస్‌కు హసరంగను ఎంపిక చేశారు. ఇప్పుడు ఐసీసీ రూల్స్ ప్రకారం హసరంగ బంగ్లా సిరీస్‌కు సస్పెన్షన్‌కు గురయ్యాడు.
ఐసీసీ నిబంధనలు పాటిస్తున్నట్లు కవర్ చేసి హసరంగ నిషేధాన్ని తప్పించుకున్నాడు. ఈ ప్రణాళిక వెనుక శ్రీలంక క్రికెట్ బోర్డు హస్తం కూడా ఉందని తెలుస్తుంది. అయితే హసరంగ, శ్రీలంక బోర్డుపై నెటిజన్లు సీరియస్ అవుతున్నారు. ఐసీసీని ఓ జోక్‌గా మార్చకూడదని కామెంట్లు చేస్తున్నారు. ఇలా మరొక ప్లేయర్ శిక్ష నుంచి తప్పించుకోకుండా నిబంధనలు మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై ఐసీసీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. నిషేధానికి గురైన సందర్భంలో ఇతర ఫార్మాట్ల రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకోకూడదనే రూల్ తీసుకువస్తుందో లేదో చూడాలి.